వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన రహదారుల దిగ్బం ధంతో జిల్లాలో రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది.
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన రహదారుల దిగ్బం ధంతో జిల్లాలో రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహనాలు తిరక్కపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతి నుంచి దాదాపు రెండువేల మంది చిత్తూరులో పనిచేస్తున్నారు. వీరిలో 25 శాతం మంది రైలులో వెళుతుండగా, మిగిలిన వారు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి చంద్రగిరి రోడ్డు ట్రాక్టర్లతో నిండిపోవడంతో ఆ వైపు బస్సులు వెళ్లలేకపోయాయి.
ఉద్యోగులు గమ్య స్థానాలకు చేరలేకపోయారు. రహదారుల దిగ్బంధాన్ని ముందుగానే ఊహిం చిన కొంతమంది రైళ్లలో వెళ్లారు. తిరుపతి నుంచి చిత్తూరు మీదుగా కాట్పాడి వరకు వెళ్లే ప్యాసింజర్ రైలు ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. రైలులో సామర్థ్యానికి మించిన ప్రయాణికులు ఉండడంతో నానా అవస్థలు పడ్డారు. తిరుపతి నుంచి మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తికి వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే ఉద్యోగులు కూడా బుధవారం ఇబ్బందిపడ్డారు. కొన్ని బస్సులు మార్గమధ్యంలో నిలిచి పోవడంతో మిగిలిన వాటిని ఆర్టీసీ అధికారులు డిపోలకే పరిమితం చేశారు.
చిత్తూరు నుంచి తిరుపతికి రవాణా వ్యవస్థ నిలిచిపోయిన విషయం తెలుసుకున్న తమిళనాడు ప్రయాణికులు వేలూరు మార్గం ద్వారా చిత్తూరు చేరుకోవడానికి విఫలయత్నం చేశారు. వాహనాలు బారులు తీరి నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కొన్ని వాహనాలను పంపగలిగారు. చిత్తూరు కార్యకర్తలు ముందుగానే ఊహించి అరెస్టు చేసిన వెంటనే మరో కార్యకర్తల బృందాన్ని అక్కడికి పంపి, దిగ్బం ధాన్ని కొనసాగించారు. కుప్పంలో బస్సులు కర్ణాటక సరిహద్దు వరకు నిలిచిపోయాయి.
సాయంత్రం 5 గంటల వరకు కూడా బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీ సులు పలుసార్లు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బతిమాలుకోవాల్సి వచ్చింది. మదనపల్లెలోనూ బస్సులను అడ్డుకోవడంతో స్థానిక నాయకులను అరెస్టు చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి చెన్నై మార్గంలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నైకు వెళ్లే పుత్తూరు, నగరి, నాగలాపురం, నారాయణవనంలో రోడ్లను దిగ్బంధం చేయడంతో చెన్నైకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
చెన్నై నుంచి తిరుమలకు రావాల్సిన బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. తమిళనాడులోని వేలూరు మార్గం, కర్ణాటక నుంచి వచ్చే బస్సులు నిలిచిపోవడంతో తిరుమలకు భక్తుల రద్దీ తగ్గిపోయింది. చంద్రగిరిలో చిత్తూరు, బెంగళూరు రహదారిని ట్రాక్టర్లతో దిగ్బంధించారు. పుంగనూరు వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేసేశారు.
చిత్తూరు, కుప్పం, పలమనేరు, శ్రీకాళహస్తి నుంచి దూర ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు ఆయా యాజమాన్యాలు సెలవు ప్రకటిం చాయి. మరికొన్ని పాఠశాలలు దూరప్రాం తాల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చాయి. పార్టీ కార్యకర్తలు కూడా అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. పాలు, ఆహార పదార్థాలు, వైద్య సంబంధిత వాహనాలను పంపించారు.