బొల్లినేని సృష్టించిన పలు సూట్‌కేసు కంపెనీల వివరాలు
సాక్షి, నెల్లూరు: ‘నేను ఎవరినీ మోసం చేయలేదు. నాగపూర్‌లో నాపై ఏసీబీ కేసు మాత్రమే నమోదైంది, ఆ కేసు కూడా మూసేశారు. నాకు రెండు బ్యాంకుల్లోనే ఖాతాలున్నాయి. సబ్‌కాంట్రాక్టర్లకు అప్పులు కూడా లేను.. నాపై అసత్యప్రచారం చేస్తూ బురదజల్లుతున్నారు’ ఇదీ ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఇటీవల నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నమాటలు. వాస్తవంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఎమ్మెల్యే బొల్లినేని చేసిన ఆర్థిక మోసాలను వెల్లడించేందుకు సాక్షి కార్యాలయానికి క్యూ కట్టారు. ఎన్నో సూట్ కేసు కంపెనీలు స్థాపించి బ్యాంక్‌లను బురిడీ కొట్టించిన వైనంతో పాటు సబ్ కాంట్రాక్టర్లను మోసం చేసి బిల్లులు ఎగ్గొట్టిన అంశంపై పూర్తి ఆధారాలతో సహా వెల్లడించారు.
బొల్లినేని మోసం ఇలా..
మూడు దశాబ్దాల క్రితం శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీతో ప్రారంభమైన వ్యాపారం ఎన్నో ఆర్థిక మోసాలతో విస్తరించినట్లు తెలిసింది. తన సొంత కంపెనీతో పాటు బ్యాంక్‌లను బురిడీ కొట్టించి రుణాలు పొందేందుకు ఎన్నో సూట్ కేసు కంపెనీలు, లెటర్‌హెడ్ కంపెనీలు సృష్టించారు. తన కుటుంబ సభ్యులను డైరెక్టర్లుగా ఉంచి దాదాపు 37 కంపెనీలను జిల్లాలోని కలిగిరి మండలం పెద్దపాడు, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, మహారాష్ట్రలోని చంద్రపూర్, నాగపూర్‌లోని తన నివాసాల అడ్రస్‌లతో ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. అష్ట వినాయక ప్రూట్‌గ్రోయర్స్ అండ్ ప్రాసెస్ లిమిటెడ్ కంపెనీకి అనుబంధంగా మరో తొమ్మిది కంపెనీలు, గ్లోబుల్ పాలిఫైబర్స్ ప్రైవే టు లిమిటెడ్, కాకతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీకి అనుబంధంగామరో తొమ్మిది కంపెనీలు, చైతన్యజ్యోతి వెజిటబుల్స్ అగ్రిఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఎన్‌కే కన్‌స్ట్రక్షన్, సిగ్మా కన్‌స్ట్రక్షన్, శ్రీనివాస టెక్నోక్రాప్ట్, శ్రీనివాస టెక్నాలజీస్, హలో డస్ట్‌బిన్ ప్రైవేటు లిమిటెడ్, ఇలా ఎన్నో కంపెనీలు సృష్టించి తన ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు ఆధారాలు చూపించారు.
బ్యాంక్‌లకు బురిడీ
మహారాష్ట్రతో పాటు ఏపీలో బంజరు, సాగు భూములను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఆయా భూములకు రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ చూపించి రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఆ భూములను తమ సూట్‌కేసు కంపెనీలు, లెటర్‌హెడ్ కంపెనీల ద్వారా కొనుగోలుచేసినట్లు చూపి బ్యాంక్ రుణాలు పొందుతారు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఐసీఐసీ బ్యాంక్, దిషామ్‌రాయ్ విటల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, రిలిజర్ పిన్‌వెస్ట్ లిమిటెడ్, దియావత్‌మాల్ అర్బన్ బ్యాంక్‌లలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. ఆయా బ్యాంకుల్లో దాదాపు రూ.100కోట్లకు పైగా రుణాలు పొందినట్లు తెలిసింది. అలాగే పలు బ్యాంక్‌ల గ్యారెంటీలతో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌లో(ఎన్‌ఎస్‌ఐసీ) దాదాపు రూ.100 కోట్లు వరకు రుణం తీసుకున్నట్లు తెలిసింది.
లా ట్రిబ్యునల్ వరకు వెళ్లిన బొల్లినేని వ్యవహారం
బొల్లినేని ఆర్థిక వ్యవహారం విషయం లా ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. శ్రీనివాస కనస్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నాగపూర్‌లో రాజేష్ స్టీల్ అండ్ వైర్ ఇండస్ట్రీస్ కంపెనీ దగ్గర నిర్మాణాలకు సంబంధించిన పలు వస్తువులు కొనుగోలు చేసి బిల్లులు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ ప్రతినిధులు ముంబయిలోని లాట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో టీసీపీ 982–2017లో కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీల విషయం లాట్రిబ్యునల్‌వరకు వెళ్లడంతో హడావుడిగా కేసును పరిష్కరించుకున్నట్లు తెలిసింది.
పోలీసు కేసుల వరకు..
మహారాష్ట్రలోని విదర్భ కుంభకోణంపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశంమైంది. శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అంచనాలు పెంచి పనులు చేసిన విషయం ఏసీబీ నిర్ధారించడంతో దాదాపు రూ.800 కోట్ల పనులను కూడా రద్దుచేశారు. దాంతో పాటు సబ్‌కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగనామం పెట్టిన విషయంలో బాధితుడు ఎన్‌వీ రామారావు, చంద్రశేఖర్ నాగపూర్‌లోని క్రైంబ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే బొల్లినేనిపై సబ్‌కాంట్రాక్టర్ చంద్రశేఖర్ మరో చెక్‌బౌన్స్ కేసు కూడా నమోదు చేయించాడు. నాగపూర్‌లో క్రైంబ్రాంచ్ పోలీసులపై రాజకీయ ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో హైకోర్టు ద్వారా కేసు నమోదుకు ఆదేశాలు ఇప్పించినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో లతితాపూర్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రాకు బిల్లు నగదు ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేయడంతో ఎమ్మెల్యే బొల్లినేని అతని కుటుంబ సభ్యులకు న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు తెప్పించుకున్నారు. అలాగే ఒంగోలు, రాజమండ్రిలో కూడా బొల్లినేని వ్యవహారంపై సీఐడీకి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment