తెలంగాణలో టీఆర్‌ఎస్ అవసరమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమపార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అవసరమా? అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. లక్ష్యం నెరవేరాక ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా కొనసాగించడం అవసరమో లేదో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలన్నారు. ఆయన శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం, లేదా రానున్న ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం ఏఐసీసీ పరిధిలోని అంశమని, దానిపై తానెలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. తన అభిప్రాయమేమిటో పార్టీ అడిగితే వారికే చెబుతానన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇరుప్రాంతాల్లో ప్రజల్లో ఆత్మస్థైర్యం కల్పించాల్సిన అవసరముందని, ఆ దిశగా తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విభజన వల్ల ఒకింత ఆవేదన ఉన్నా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వల్ల సీమాంధ్రకు మంచే జరుగుతుందన్నారు. ఈ నెల 5వ తేదీన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన డీసీసీ అధ్యక్షులు, కార్యవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే...
కేంద్ర మంత్రి జైరాం రమేష్‌పై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఒకస్థాయిలో ఉన్న నేతలు హుందాగా వ్యవహరించాలి.
ప్రజల్లో ఉన్న సెంటిమెంటును సొమ్ముచే సుకోవాలనే కొంతమంది కొత్త పార్టీల పేరిట ప్రజల ముందుకు రావాలని చూస్తున్నారు. అలాగే రాజకీయ స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్టీలు మారుతున్న వారికి ప్రజలు తగిన సమాధానం చెబుతారు.
సీఎంగా ఉంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యవహారాలపై తమ దగ్గర సమాచారముందని, దాన్ని ప్రజల ముందు పెడతామని సీనియర్ మంత్రులు చెప్పడాన్ని నేను ఖండించబోను. ఆ సమాచారంలో ఇంకా ఏమైనా సందే హాలుంటే నన్ను అడగండి మరింత సమాచారం ఇస్తాను.
సింగపూర్‌లో చంద్రబాబుకు చాలా ఆస్తులున్నాయి కనుకనే తాను గెలిస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెప్తున్నారు. మేమలా చెప్పలేం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోకన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాం.