హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై బొత్స సత్యనారాయణ ప్రోద్భలంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు మహాసభ ప్రతినిధులు రవితేజ, వీరన్న చౌదరి, సదాశివరెడ్డి, వీఎస్ గాంధీలు గురువారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సమైకాంధ్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు పీసీసీ అధ్యక్షులు, మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బొత్స అనుచరులు దాడులు చేశారని, దీనిపై ఢిల్లీలో విశాలాంధ్ర ప్రతినిధులు బొత్సను ప్రశ్నించారని తెలిపారు. అప్పటి నుంచి సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న వారిపై, విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వినర్ మామిడి అప్పలనాయుడులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అనేక మంది విద్యార్థుల అచూకీ లేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 200 మంది ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు.
సమైకాంధ్ర ఉద్యమాన్ని అణచివేయాలన్న కుట్రతోనే విజయనగరంలో కర్ఫూ విధించారని, ఇది ఉద్యమించే ప్రజల హక్కులను కాలరాయడమేనన్నారు. ఈనెల 5 నుంచి విజయనగరం ప్రజలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో వెంటనే కర్ఫూ ఎత్తివేసి ప్రజలను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీని వెంటనే ప్రభుత్వం ప్రకటించేలా చర్యలు చేపట్టాలని నివేదించారు.
విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులను విజయనగరంలోకి అనుమతించడం లేదని, ఇది తమ హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్...ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నవంబర్ 19లోగా నివేదిక సమర్పించాలని విజయనగరం జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది.