
ప్రమాదంలో మృతి చెందిన బాలుడు మైలపల్లి పోలీసు
నెల్లిమర్ల రూరల్: శివజాగరణ చేసి వెళ్తు న్న ఓ కుటుంబం రహదారి ప్రమాదంలో చిన్నారి బాలుడిని కోల్పోయింది. మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం దేవస్థానానికి పూజలుజాగరణ కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆటోబోల్తాపడిన సంఘటనలో ఆ చిన్నారి ప్రాణం గాలిలో కలసిపోయింది. మండలంలో పెదతరిమి జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొత్త ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి రామారావు కుటుంబ సభ్యులు రామతీర్థంలో జరిగే శివరాత్రి జాతరకు సోమవారం ఆటోలో వచ్చారు.
రాత్రంతా జాగరణ చేసి మంగళవారం స్వామివారిని దర్శించుకొని ఆటోలో తిరిగి వెళుతున్న క్రమంలో పెదతరిమి గ్రామం వద్దకు రాగానే వెనుక నుంచి మద్యం మత్తులో అతివేగంతో వస్తున్న ద్విచక్రవాహన చోదకుడు ఆటోను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆటో కంట్రోల్ తప్పడంతో పక్కనే ఉన్న నాలుగు అడుగుల గోతిలో బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మైలపల్లి పోలీసు అనే ఎనిమిది నెలల బాలుడి తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాబు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అభం శుభం తెలియని పసికందు ఇలా రహదారి ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment