కర్నూలు, న్యూస్‌లైన్ :
తనకు నచ్చని వారితో తిరుగుతోందన్న అనుమానంతో ప్రియురాలిని హత్యచేసిన ఓ వ్యక్తి నేరం బయటకు రాకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారణ ప్రారంభించి ఎట్టకేలకు ఛేదించారు. ఇందిరాగాంధీ నగర్ సీపీఎం కార్యాలయ సమీపంలో మురుగు కాల్వలో లభించిన మహిళ మృతదేహం కేసులో ముగ్గురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం ఫోర్థ్ టౌన్ సీఐ కేశవరెడ్డి సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గొంతుకు తాళ్లతో బిగించి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారం గడవకముందే కేసు మిస్టరీని ఛేదించారు. ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన వడ్డె రంగ మురళి, అతని తల్లి శేషమ్మ, స్నేహితుడు చాకలి బండరాముడిని అరెస్ట్ చేసి గురువారం మధ్యాహ్నం కర్నూలు డీఎస్పీ వైవి.రమణకుమార్ ఎదుట హాజరు పరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ పిటి.కేశవరెడ్డితో కలిసి డీఎస్పీ రమణకుమార్ విలేకరులకు వెల్లడించారు. హైదరాబాద్ శివరాంపల్లి ప్రాంతానికి చెందిన బుడగ జంగాల ముత్యాలమ్మ(32) రెండో భర్త రాముడితో మనస్పర్థలు రావడంతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఏడాదిన్నర క్రితం కర్నూలు చేరుకుంది. రైల్వే స్టేషన్‌లో ఉంటూ ప్లాట్‌ఫారంతోపాటు నగరంలో కూడా హిజ్రాలతో కలిసి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన వడ్డె రంగమురళితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య కొంతకాలం వివాహేతర సంబంధం కొనసాగింది. అనంతరం ఆమెపై అనుమానం పెంచుకున్న రంగ మురళి తాను చెప్పినట్టే నడుచుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఈ నేపథ్యంలో తనను వదిలించుకునేందుకు ముత్యాలమ్మ ప్రయత్నిస్తున్నదని గ్రహించి ఈనెల 9 వతేదీ రాత్రి డోన్ నుంచి యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి తెల్లవారుజామున రెండు గంటల కు కర్నూలు చేరుకున్నాడు. ఇందిరాగాంధీ నగర్‌లో ఉన్న తన ఇంటికి పిలుచుకెళ్లి హత్య చేశాడు.
తల్లి శేషమ్మ, మిత్రుడు చాకలి రాముడి సాయంతో మృతదేహాన్ని సంచిలో మూట గట్టి కేసీ కాల్వలో పడేసే ప్రయత్నంలో మురికి కాల్వ వద్ద మూట జారిపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెతోపాటు రైల్వే స్టేషన్‌లో తిరిగిన మహిళలు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు వడ్డె రంగ మురళి కొత్త బస్టాండ్ దగ్గర అరటి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. విచారణలో నేరం అంగీకరించాడు.
ప్రియుడే హంతకుడు
Published Fri, Oct 18 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement