శంకరరావుతో తల్లిదండ్రులు
శ్రీకాకుళం, హిరమండలం: నేస్తాలతో కలిసి ఊరంతా పరుగులు పెట్టాల్సిన వయసులో ఆ బాలుడు మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులతో గోరు ముద్దలు తినిపించుకోవాల్సిన ప్రాయంలో ఇన్నిన్ని మందు బిళ్లలు మింగుతున్నాడు. నవ్వులతో ఇంటిల్లిపాదినీ మురిపించాల్సిన పిల్లాడు ఆ నవ్వునే మర్చిపోయి బతుకు కోసం నిత్యయుద్ధం చేస్తున్నాడు. హిరమండలం పెద్దకోరాడకు చెందిన బెవర శంకరరావు క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఆర్థిక స్థోమత సరిపోక, కుమారుడి చికిత్సకు డబ్బులు సర్దలేక ఆ తల్లిదండ్రులు నిత్యం నరకం చూస్తున్నారు.
బెవర ఆదినారాయణ, నారాయణమ్మలకు ఇద్దరు పిల్లలు కాగా చిన్నకుమారుడు శంకరరావు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. క్యాన్సర్ లక్షణాలు కనిపించడంతో విశాఖ మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్య పరీక్షలు చేసి బ్లడ్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. ప్రాథమిక స్థాయిలో ఉందని, చికిత్స చేస్తే నయమవుతుందని అక్కడి వైద్యులు తెలిపారు. కానీ ఆపరేషన్‌తో పాటు మందులకు లక్షలాది రూపాయలు ఖర్చవుతాయని చెప్పడంతో కుమారుడిని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వ్యవసాయ కూలీ కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇప్పటికే అందిన దగ్గర అప్పులు చేసి వైద్యం చేయించారు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదని తల్లిదండ్రులు ఆదినారాయణ, నారాయణమ్మలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
దయార్థ్ర హృదయులు స్పందించి తమ కుమారుడికి పునర్జన్మ కల్పించాలని వేడుకుంటున్నారు. సహాయం చేయదలచిన వారు 8790695520 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబాలుడు
Comments
Please login to add a commentAdd a comment