
కుదేలైన ఖరీఫ్
ఏటా భారీగా తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం
ఆరేళ్లలో సాగుకు నోచుకోని భూమి 98,384 హెక్టార్లు
2015లో 42,914 హెక్టార్ల బీడు భూమి
జిల్లాలో ఖరీఫ్ సాగు క్రమంగా కనుమరుగవుతోంది. వర్షాభావం, పెరిగిన సాగు పెట్టుబడి, నకిలీ విత్తనాల ప్రభావం పంటల విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అప్పు చేసి పంటలు పండించడం కంటే.. బీడుగా వదిలేయడమే ఉత్తమం అని అన్నదాతలు భావిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వంటి శాశ్వత నీటి వనరులు లేకపోవడం, కేవలం వర్షంపైనే ఆధారపడడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఆరేళ్లలో దాదాపు లక్ష హెక్టార్ల భూమి సాగుకు నోచుకోకవడమే ఇందుకు నిదర్శనం.
బి.కొత్తకోట: వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయం కుదేలవుతోంది. దీంతో క్రమంగా సాగు విస్తీర్ణంగా పడిపోతోంది. ఏటా ఈ మారు ఖరీఫ్ సాగు బాగుంటుందని ఆశలుపెట్టుకోవడం.. తర్వాత బీళ్లుగా వదిలేయడం రైతులకు సాధారణమైపోతోంది. సాగునీటీ వనరులు, ప్రాజెక్టులులేని జిల్లాలో వర్షాధారంపైనే పంటలు సాగవ్వాలి. ఈ పంటలపైనే రైతుల ఆర్థిక పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ఇందులో ప్రధానమైన పంట వేరుశెనగ. ఇది రైతుల వాణిజ్యపంట. దీనిద్వారా లభించే ఆదాయంపై రైతులు ఏడాది పోడవునా ఆధారపడుతారు. అయితే కొన్నేళ్లుగా సేద్యం రైతుల పాలిట శాపంగా మారింది. వర్షాలు సకాలంలో కురవకపోవడం, కరువు కారణంగా భూములు సాగుకు నోచుకోవడంలేదు.
ఫలితంగా జిల్లాలో సాధారణసాగు విస్తీర్ణం ఏటా పడిపోతూ వస్తోంది. 2013 ఖరీఫ్ మినహాయిస్తే మిగిలిన ఆరేళ్లలో 98,384 హెక్టార్లలో సేద్యం సాగలేదు. 2010 ఖరీఫ్‌లో 2,12,942 హెక్టార్లలో సాధారణ సాగుగా నిర్ణయించగా అత్యధికంగా 2,27,685 హెక్టార్లలో సాగు జరిగింది. అన్నింటీకంటే ప్రస్తుత ఖరీఫ్ దారుణంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో అన్నిపంటలు కలుపుకొని 2,07,502 హెక్టార్లలో సాధారణ సాగు జరగాల్సి వుంది. అయితే వర్షాభావ పరిస్థితులు రైతులను వెంటాడింది. దీంతో కేవలం 1,64,588 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. మిగిలిన పోలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.
వరి పరిస్థితీ ఇంతే..
జిల్లాలో వరి సాగు పరిస్థితి కూడా అంతతమాత్రంగానే ఉంది. వరుణదేవుడు ముఖంచాటేస్తుండటం ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతోంది. గత దశాబ్దంలో వరి సాగు ఆశాజనకంగా ఉండేది. 2010 ఖరీఫ్ నుంచి వరి సాగు క్రమంగా పడిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం సాగవుతున్న వరి పంట..పడమటీ మండలాల్లో నామమాత్రమే. ఈ సాగంతా తూర్పు మండలాల్లో జరుగుతోంది. పశ్చిమప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయి ఆరుతడి పంటలే సాగుచేయలేని పరిస్థితుల్లో రైతాంగం ఉంది.