
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్‌ను ఈనెల 12న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సచివాలయానికి చేరింది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్‌కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాల అమలును ప్రతిబింబించేలా బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నాలుగు నెలలకు అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. కాగా, ఈనెల 11న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.