మేనిఫెస్టో అమలు చేసేలా బడ్జెట్‌ రూపకల్పన  | Budget design to execute manifesto guarantees implementation | Sakshi
Sakshi News home page

మేనిఫెస్టో అమలు చేసేలా బడ్జెట్‌ రూపకల్పన 

Published Thu, Jun 13 2019 5:01 AM | Last Updated on Thu, Jun 13 2019 5:01 AM

Budget design to execute manifesto guarantees implementation - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరూ అభివృద్ధి చెందేలా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో తన చాంబర్‌లో బుగ్గన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న ప్రతీ రూపాయి వృథా కాకుండా చిత్తశుద్ధితో ఖర్చు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, దీన్ని తిరిగి గాడిలో పెట్డడం అతి ముఖ్యమైన పని అని తెలిపారు. ఆర్థిక అంశాలపై పట్టురావడానికి కారణమైన స్వర్గీయ సోమయాజులు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆర్థిక మంత్రి పదవి అప్పచెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, ఈ స్థాయికి రావడానికి కారణమైన డోన్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌ సింగ్‌ రావత్, కార్యదర్శి ఎం.రవిచంద్ర తదితరులు మంత్రి బుగ్గనకు శుభాకాంక్షలు తెలిపారు. 

మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలి 
డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య శాఖ మంత్రి కె.నారాయణస్వామి 
నవరత్నాల్లో మహిళలకు కానుకగా ప్రకటించిన దశలవారీ మద్యపాన నిషేధం అమలుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య శాఖ మంత్రి కె.నారాయణస్వామి పిలుపునిచ్చారు. బుధవారం నాల్గవ బ్లాకులోని తన చాంబర్‌లో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. తక్షణం బెల్ట్‌షాపులను తొలగించాల్సిందిగా బ్రాందీ షాపుల యజమానులను ఆదేశించారు. అందరూ నిజాయతీగా ఉండాలని, ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన శాఖలోని ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. 

బీసీల అభ్యున్నతే మా లక్ష్యం 
బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ 
రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతే తమ లక్ష్యమని, ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తెలిపారు. బుధవారం సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లోని తన చాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నవరత్నాలతో పాటు ఏలూరు బీసీ గర్జనలో ప్రకటించిన డిక్లరేషన్‌ను తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. బీసీ సంక్షేమానికి సేవ చేసుకునే అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలోని 2.10 లక్షల మంది రజకులు, 80 వేల మంది నాయీబ్రాహ్మణులకు ఏటా రూ. 10,000 ఇచ్చే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. 

త్వరలో భూముల రీ సర్వే 
డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
రాష్ట్రంలో భూములను రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రకటించారు. 1908 తర్వాత భూముల సర్వే జరగలేదని, ఇప్పుడు రీ సర్వే చేయడం ద్వారా కోర్టులు, వివాదాల్లో ఉన్న అనేక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు 25 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనికి అనుగుణంగా భూ సేకరణ చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి భూములను చాలా చోట్ల రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీలు లేకుండా పీవోపీ కింద పెట్టారని, ఈ సమస్య పరిష్కరించడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. భూ సేకరణ సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం కాకుండా పరిహారం చెల్లించే రోజు ఉన్న మార్కెట్‌ ధరను వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తూ తొలి ఫైలుపై మంత్రి సంతకం చేశారు. ఒప్పందం సమయానికి చెల్లింపు సమయానికి ఉన్న ధరల వ్యత్యాసం వల్ల భూయజమానులు నష్టపోతున్నారని, దీనికి అడ్డుకట్టవేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిళ్లు 
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్‌ 
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్‌ ప్రకటించారు. బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్‌లోని తన చాంబర్‌లో విశ్వరూప్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయని, మరో రెండు సర్కిళ్ల ఏర్పాటుకు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. మిగిలిన 8 జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 1,000 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 850 కోట్లు మురిగిపోయాయని, సాంఘిక సంక్షేమానికి రూ. 4,500 కోట్లు కేటాయించి రూ. 2,600 కోట్లు వెనక్కి తీసుకుందన్నారు. తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేస్తుందని చెప్పారు. సీఎం ఆశయాల మేరకు గురుకులాలు, హాస్టళ్ల పనితీరును మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. 

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం 
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు 
రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడికి సొంతిల్లుండాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయాన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పేర్కొన్నారు. ఇందు కోసం సుమారు 28 లక్షల గృహాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. బుధవారం సచివాలయం నాల్గవ బ్లాక్‌లో మంత్రి తన చాంబర్లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అత్తిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో వంద శాతం ఇందిరమ్మ గృహాలు నిర్మించామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో మంత్రిగా రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కట్టించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆ శాఖ అధికారులు రంగనాథరాజుకు అభినందనలు తెలిపారు. 

పర్యాటక ఆదాయంపై దృష్టి 
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ 
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పించడానికి ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమిస్తామన్నారు. పర్యాటక రంగంపై ప్రాథమికంగా సమీక్ష నిర్వహించిన అనంతరం బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధ్యాత్మికం, ప్రకృతి, బీచ్, మౌంటైన్‌ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆదాయం పెంచేలా కృషి చేస్తామని తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి హిందీ, ఇంగ్లీçషు భాషలపై పట్టు ఉన్న గైడ్‌లను నియమించుకోనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో కన్వెన్షన్‌ హాల్‌తో కూడిన శిల్పారామాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.  

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి 
ట్రాన్స్‌పోర్ట్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని  
జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ట్రాన్సుపోర్టు, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల భోజన విరామ సమయంలో ఆయన నేరుగా మీడియా పాయింట్‌కు వచ్చి జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్నారు. తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి రాష్ట్రంలో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) వ్యవస్థాపక నాయకుడిగా పనిచేశారని, అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులతో తనకు సాన్నిహిత్యం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు.  జర్నలిస్టులతో తనకు ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఉందని, వారి కష్టాలు తనకు తెలుసన్నారు. జర్నలిస్టులకు స్థలాలు, ఇళ్లు, చాలీచాలని జీతాలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని నాని హామీ ఇచ్చారు.

తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి నియామకం
తిరుపతి పట్టణ అభివృద్ధి అథారిటీ (తుడా) చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 2004వ సంవత్సరంలో కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తుడా చైర్మన్‌గా చెవిరెడ్డిని నియమించారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి ఆయనను అదే పదవిలో నియమించడం విశేషం. ప్రస్తుతం తుడా చైర్మన్‌గా ఉన్న జి.నరసింహ యాదవ్‌ రాజీనామా చేయగా దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement