తిరుపతి(మంగళం): శేషాచల అడవులు, అటవీశాఖ కార్యాలయాల గోదాముల నుంచి ఎర్రచందనం తరలిపోకుండా ఉండేందుకు ముందుగా ఇంటి దొంగల పనిపట్టాలని అటవీశాఖాధికారులు, పోలీసులకు రాయలసీమ రేంజ్ ఇన్‌చార్జ్ ఐజీ వేణుగోపాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్‌టీసీ ద్వారా ఈ-టెండర్లలో వేలం నిర్వహిస్తున్న ఎర్రచందనాన్ని, వాహనాలను పరిశీలించేందుకు ఆయన ఆదివారం తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి విచ్చేశారు.
అయితే అక్కడకు మీడియా రావడంపై ఆయన పోలీస్ అధికారులపై మండిపడ్డారు. ఎవరినీ లోనికి అనుమతించవద్దని ఆదేశించారు. అనంతరం ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీఎఫ్) కార్యాలయంలో అటవీశాఖ, టాస్క్‌పోర్సు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషాచల అటవీప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగితే ఆ పరిధికి సంబంధించిన బీట్ ఆఫీసర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
నిర్లక్ష్యం కారణంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగితే బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ఇంటి దొంగల సహాయంతో గోదాముల్లోని ఎర్రచందనం తరలిపోతోందని, దానిని అరికట్టేందుకు గోదాముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. గోదాముల వద్ద పటిష్ట భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీఎఫ్‌వో శ్రీనివాసులుతెలిపారు. సమావేశంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టీ, టాస్క్‌ఫోర్సు ఇన్‌చార్జ్ ఓఎస్‌డీ ఇలియాజ్ బాష, ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇంటి దొంగల పనిపట్టాలి
Published Mon, Aug 18 2014 4:20 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement