చెన్నై నుంచి నెల్లూరు వస్తున‍్న ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులో డ్రైవరుకు గుండెపోటు రావడంతో బస్సు నడుపుతూనే మరణించాడు.
నెల్లూరు: చెన్నై నుంచి నెల్లూరు వస్తున‍్న ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులో డ్రైవరుకు గుండెపోటు రావడంతో బస్సు నడుపుతూనే మరణించాడు. బస్సు నడుపుతున‍్న డ్రైవర్ గురవయ‍్యకు ఉన‍్నట్టుండి ఛాతీలో నొప్పి వచ్చింది. కొద్ది సమయంలో సీటులోనే కుప‍్పకూలిపోయాడు. దాంతో బస్సు రోడ్డుపై అస్తవ్యస్తంగా ప్రయాణించి డివైడర్‌ను దాటుకుని ముందుకెళ్లి బస్టాపు గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుంచి నెల్లూరుకు 40 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. అర్ధరాత్రికి చోళవందాన్ సమీపంలోని అళింజివాక్కం వద్ద ప్రయాణిస్తుండగా డ్రైవర్ గురవయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో గుండెను గట్టిగా అదిమి పట్టుకున్న స్థితిలోనే ఆయన సీటులో వాలిపోయాడు. అర్ధరాత్రి సమయం కావడంతో అప్పటికే నిద్రలో ఉన్న ప్రయాణికులు దీనిని గుర్తించలేదు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మహిళలు సహా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చోళవరం ఇన్‌స్పెక్టరు బాలసుబ్రమణియం, పోలీసులు క్షతగాత్రులను పొన్నేరి ఆస్పత్రికి తరలించారు.