అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ఆర్టీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజ్ చేస్తుండడంతో జిల్లాలో దాదాపు 70 సర్వీసులు నిలిచిపోయినట్టు తెలిసింది. టూరిస్ట్ అనుమతి ముసుగులో స్టేజి క్యారియర్లగా హైదరాబాద్‌కు బస్సులను నడుపుతూ, వాహన చట్టాన్ని అతిక్రమిస్తున్నందున ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తూ.. బస్సులను సీజ్ చేస్తున్న పరిణామాలు వాటి యాజమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అమలాపురం నుంచి రోజూ హైదరాబాద్‌కు వెళ్లే 25 బస్సులను సోమవారం నిలిపేశారు. ముందే బుక్ చేసుకున్న ప్రయాణికులకు బస్సులను నిలిపివేసిన సమాచారాన్ని ఫోన్లు చేసి చెబుతున్నారు. ఈ రోజు బస్సు అనివార్య కారణాల వల్ల హైదరాబాద్‌కు వెళ్లడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులను అభ్యర్థిస్తున్నారు. దీంతో ప్రయాణికులు చేసేది లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి బయటకు తెచ్చేందుకు, పాలెం సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను అదుపు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు విలవిల్లాడుతున్నాయి.
జిల్లావ్యాప్తంగా నిత్యం హైదరాబాద్‌కు ట్రావెల్స్ బస్సులు దాదాపు 110 ప్రయాణిస్తుంటాయి. ఇవన్నీ టూరిస్ట్ అనుమతితో ఒకచోట నుంచి మరో చోటకు నేరుగా ప్రయాణికులను తీసుకెళ్లే పద ్ధతిలో పన్ను చెల్లిస్తారు. అయితే స్టేజి కేరియర్లుగా నాలుగైదు చోట్ల ప్రయాణికులను ఎక్కించుకుని, ఆర్టీసీలా సొమ్ము చేసుకుంటున్నారు.
జిల్లా నుంచి ప్రయాణించే వాటిలో సోమవారం దాదాపు 70 బస్సులను నిలిపేశారు. సంక్రాంతి పండగల సీజన్‌తో ప్రైవేట్ హైటెక్ బస్సులన్నీ టికెట్‌కు అధిక ధర వసూలు చేసి, నిబంధలనకు విరుద్ధంగా నడుపుతారని ఆర్టీఏ అధికారులు నిఘా పెట్టడంతో, ఈ సమాచారాన్ని ముందే పసిగట్టిన ట్రావెల్స్ యాజమానులు బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. జిల్లాకు చెందిన మరికొన్ని బస్సులను మార్గమధ్యంలోనే నిలిపివేస్తున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు రావాల్సిన కొన్ని బస్సులను కూడా అక్కడే నిలిపేశారు. ఒకటి అరా ట్రావెల్స్ సంస్థలు మాత్రం తమ బస్సులను ధైర్యం చేసి వేరే మార్గాల్లో నడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి.