భవనాలతో బిజినెస్
యనమలకుదురు (పెనమలూరు) : సాక్షాత్తూ అధికార పార్టీ నేతలే అక్రమాలకు ఊతమిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారు. యనమలకుదురులో సోమవారం చోటుచేసుకున్న ఇలాంటి ఓ ఘటన అధికారులు, పోలీసుల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురు కరకట్ట దిగువన నదీ పరివాహక ప్రాంతంలో ఓ బిల్డర్ నిబంధనలకు వ్యతిరేకంగా గ్రూప్‌హౌస్ నిర్మిస్తున్నారు.
దీంతో సోమవారం సీఆర్‌డీఏ అధికారులు రంగంలోకి దిగి పోలీస్ బందోబస్తుతో అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. ఈలోగా స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన అనుచరులతో సంఘటనా స్థలం వద్దకు వచ్చారు. భవనం కూల్చేందుకు ప్రయత్నిస్తున్న సీఆర్‌డీఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తన నియోజకవర్గంలోకి ఎవరిని అడిగి వచ్చారని ప్రశ్నించారు. గ్రామాల్లో ఏ అక్రమ కట్టడం కూల్చాలన్నా తనకు ముందుగా తెలపాలని హెచ్చరించారు. బిల్డర్లతో తాను మాట్లాడుకున్నానని, అభివృద్ధికి సంబంధించి నిధులు సమీకరిస్తున్నానని తెలిపారు.
గ్రామంలో అక్రమ కట్టడాలపై తాను తీసుకుంటున్న చర్యలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వచ్చానన్నారు. ఇక్కడ విలేకరులు ఎవరైనా ఉన్నారా? అని అక్కడ ఉన్న అధికారులను అడిగారు. అక్రమ కట్టడాలైనపుడు ముందు ఎందుకు స్పందించలేదని అధికారులను ప్రశ్నించారు. దీంతో భవనాన్ని కూలుస్తున్న అధికారులు, పోలీసులు ఏం చేయాలో తెలియక వెనుదిరిగారు.
అంతా హైడ్రామానా!
భవనం కూల్చివేత కార్యక్రమం అంతా హైడ్రామాగా నడిచింది. ఇటీవల సదరు ఎమ్మెల్యే బిల్డర్లతో ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటుచేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న ప్లాట్‌కు రూ.60 వేల చొప్పున తనకు చెల్లించాలని హుకుం జారీచేశారు. గ్రూప్‌హౌస్‌లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. దీనికి బిల్డర్లు అంతగా స్పందించలేదు. దీంతో కంగుతున్న ఎమ్మెల్యే బిల్డర్లను హెచ్చరించాలనే అధికారులతో ఈ హైడ్రామా ఆడించారని గ్రామంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు క్రమబద్దీకరించుకోవాలని ఒకపక్క ప్రభుత్వం అవకాశం ఇవ్వగా, సాక్షాత్తూ ఎమ్మెల్యేనే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని మైండ్‌గేమ్ ఆడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.