డెంగీతో వార్డు సభ్యుడు శ్రీవేణు మృతి
కోలుకొండలో తాండవిస్తున్న పారిశుద్ధ్యలోపం
కోలుకొండ(దేవరుప్పుల) : సీజనల్ వ్యాధు ల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంలో అనుబంధ శాఖల తీవ్రవైఫల్యంతోనే విషజ్వరాలు విజృంభిస్తున్నాయని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కోలుకొండలో టీడీపీ నేత, ఆరె సంక్షేమ సంఘ మండల అధ్యక్షుడు సింధె శ్రీవేణు డెంగ్యూ జ్వరంతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని సందర్శించి ఆయా శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల కిందట ఇక్కడి పరిస్థితిపై డీఎంహెచ్‌ఓ సాంబశివరావు దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యం చేశారని, దీనికితోడు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇంటింటా విషజ్వరాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫోన్‌లో జనగామ ఆర్‌డీఓ, డీఎంహెచ్‌ఓలపై ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుటాహుటిన వచ్చిన డీఎంహెచ్‌ఓ సాంబశివరావు గ్రామానికి చేరుకొని కనీసం వాహనం దిగకుండా అరనిమిషంలోనే తిరుగుప్రయాణం పట్టడం నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుంది. అనంతరం వచ్చిన జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి పంచాయతీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో వీధులను పరిశీలించి పారిశుధ్యంపై సత్వర చర్యలు చేపట్టేందుకు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు పారిశుధ్యలోపంపై అసహనం వ్యక్తం చేశారు.
అధికారులపై ఎర్రబెల్లి ఆగ్రహం
Published Sun, Aug 23 2015 3:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement