
అధికారులు చెప్పినట్టు వినడం లేదు!
ఎంపీ ముందు బుచ్చెయ్యపేట మండల తమ్ముళ్ల ఆగ్రహం
అభివృద్ధి సమీక్ష అధికార పార్టీ సమావేశంగా మారిన వైనం
చోడవరం: ప్రజా సమస్యలు, అభివృద్ధిని పక్కన పెట్టి అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులపై ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. అభివృద్ధిపై సమీక్షించేందుకు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సోమవారం చోడవరంలో ఏర్పాటుచేసిన అధికారుల సమావేశం కాస్త అధికార పార్టీ కార్యకర్తల సమావేశంగా మారిపోయింది. మీకు పదవులు ఇచ్చాం.. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది.. మేము చెప్పినట్టు అధికారులు వినడం లేదు.. ఇదేమీ బాగోలేదంటూ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావును బుచ్చెయ్యపేట మండల టీడీపీ నాయకులు నిలదీయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఈ సమావేశానికి రెండు మండలాల చెందిన అధికారులు మాత్రమే హాజరుకావాల్సి ఉంది. కొందరు అధికారపార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు వస్తే వారిని కూడా సమావేశంలోకి అనుమతించారు. అంతవరకు బాగానే ఉన్నా ఏ అధికార హోదాలేని బుచ్చెయ్యపేటకు చెందిన విశాఖ డెయిరీ డైరక్టర్ గేదెల సత్యనారాయణతోపాటు మరికొందరు అధికార పార్టీ నాయకులను సమావేశంలోకి అనుమతించడమే కాకుండా గేదెల సత్యనారాయణను వేదికపై కూర్చోబెట్టడంపై అధికారులు గుసగులలాడుకున్నారు.
చోడవరం మండల సమీక్ష సజావుగానే ముగియగా బుచ్చెయ్యపేట మండలం అధికారులు తమ శాఖల నివేదికలు చెబుతుండగా వేదికపై ఉన్న గేదెల సత్యనారాయణ మైక్ తీసుకొని ఎంపీపై మాటల దాడికి దిగారు. అధికారం వచ్చినా అధికారులెవ్వరూ తమ మాట వినడంలేదని, ఎమ్మెల్యేకు తెలియకుండానే అధికారులను నియమిస్తుండటంపై ఎమ్మెల్యే రాజు ఎంతో బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేపీ అగ్రహారం, కోమళ్లపూడి వీఆర్‌వోలపై తాముచేసిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తగా అక్కడే ఉన్న ఉపాధి హామీపథకం అధికారులు కలుగజేసుకొని విచారణ చేస్తున్నామని బదులిచ్చారు. పోలీసులు కూడా మా మాట వినడంలేదని అధికారులపై ప్రజాప్రతినిధికాని ఆ నాయకుడు ఆగ్రహం వ్యక్తంచేసినా ఎంపీ ఖండిచకుండా కార్యకర్తలకు సహకారం అందించాలని ఆదేశించడంతో అక్కడున్న అధికారులంతా అవాక్కయ్యారు. అసలు ప్రజాప్రతినిధి కాని ఒక నాయకుడు సమావేశంలో మాట్లాడేందుకు అనుమతిచ్చిన ఎంపీ తీరుపై సర్వత్రా చర్చనీయాంశమైంది.