ఆ ఇద్దరిది ఆరు వందల కోట్ల టార్గెట్...!
పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు హడలెత్తిస్తున్నారు. వారు ఇప్పుడు దేన్నీ వదలడం లేదు. మరీ చిన్నచిన్న విషయాలను కూడా వదలడం లేదేంటని సన్నిహితులు అడిగినప్పుడు.. ఆరు వందల కోట్ల టార్గెట్ రీచ్ కావాలని బహిరంగంగానే చెప్పేస్తున్నారట. వీరిద్దరూ జిల్లాలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. అధికారులపై దాడులకు సైతం వెనుకాడకుండా అందినకాడికి కాజేస్తున్న వారు ఒకరైతే అధికార, అనధికార కార్యక్రమం ఏదైనా సరే శిలాఫలకంపై పేరు లేకపోతే గడ్డపారతో పగులగొడతానని బెదిరిస్తుంటారు ఇంకొక నేత.
ఒకాయన 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే...! మరో నేత వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వీరు సంపాదనలో మునిగిపోయారు. ఇసుక నుంచి అధికారుల బదిలీల వరకు అన్నింటిలోనూ తమ తడాఖా ఏంటో చూపిస్తున్నారు. గడచిన 16 నెలల కాలంలోనే రెండు వందల కోట్లకు తగ్గకుండా ఒకాయన వెనుకేసుకోగా...! రెండో నేత కూడా టార్గెట్‌లో సగం తన ఖాతాలో వేసుకున్నాడు. వీరి అగడాలకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ టార్గెట్ గొడవలో తాము బలవుతున్నామని వారంతా మిగతా నాయకులకు మొరపెట్టుకుంటుంటే... అధినేతకు కప్పం కట్టగా మిగిలిన దాంట్లో టార్గెట్ రీచ్ కావడమంటే ఈ గొడవలు తప్పదని ఆ నేతలిద్దరూ నిర్మొహమాటంగా సెలవిస్తున్నారట.!!!