ఖరారు కాని మద్యం పాలసీ
ప్రొద్దుటూరు : మద్యం షాపుల యజమానులు అయోమయంలో పడ్డారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 31 వరకు మద్యం దుకాణాలకు గడువు ఉంది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు దుకాణాలు ఉండరాదని ఇటీవల సుప్రీంకోర్డు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వ్యాపారులు డీలా పడ్డారు.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 109 మద్యం షాపులు, 8 బార్‌లు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు 91 మద్యం షాపులు, 6 బార్‌లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలసీలో ప్రాంతాలతో సంబంధం లేకుండా వైన్ షాపులు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు.
ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 16 షాపులు, 6 బార్‌లు రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వేంపల్లి నుంచి ప్రొద్దుటూరు, రాజుపాళెం మీదుగా చాగలమర్రి వరకు ఉన్న రహదారి స్టేట్ హైవే కిందికి వస్తుంది. దీంతో కొర్రపాడు రోడ్డులోని భగత్‌సింగ్ కాలనీ, రాజుపాళెంలో ఉన్న మద్యం షాపులకు ఈ నిబంధన వర్తిస్తుంది. చాపాడు, లింగాపురం, మైదుకూరు రోడ్డు, కేకే స్ట్రీట్, వైఎంఆర్ రాజీవ్ సర్కిల్, టిబిరోడ్డు, గాంధీరోడ్డులోని గాంధీబొమ్మ పరిసర ప్రాంతాల్లోని మద్యం షాపులు 500 మీటర్లలోపు ఉన్నాయి.
కొత్త మద్యం పాలసీ ప్రకారం పట్టణ, మండలాల్లో 90 శాతం పైగా మద్యం దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుతం వార్డుల వారీగా దుకాణాలను నిర్వహిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాల నిర్వహణ జరగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో అధికారులే మద్యం షాపు ఏర్పాటుకు స్థలాలను గుర్తిస్తారా లేక ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చనే నిబంధన వస్తే ఏం చేయాలని వైన్‌షాపు యజమానులు ఆందోళన చెందుతున్నారు.
కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు..
కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 20న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జాతీయ రహదారుల్లోని 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలు, బార్‌లను గుర్తించి అధికారులకు నివేదిక పంపించాం.
–బాలకృష్ణన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు