ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే..  | Byreddy Siddharth Redddy Clarity on Speculations Nandikotkur | Sakshi
Sakshi News home page

ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే.. 

Published Tue, Aug 27 2019 7:43 AM | Last Updated on Tue, Aug 27 2019 7:45 AM

Byreddy Siddharth Redddy Clarity on Speculations Nandikotkur - Sakshi

సాక్షి, కర్నూలు : ‘‘నేను పార్టీ మారుతున్నట్లు ‘పచ్చ’ మీడియాతో ఓ వర్గం నాయకులు ప్రచారం సృష్టించారు.  ఊపిరి ఉన్నంత వరకు నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతాను, జగనన్నతోనే నడుస్తాను’’ అని వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కర్నూలులోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తనకు, ఎమ్మెల్యే ఆర్థర్‌కు విభేదాలున్నాయని ప్రచారం చేస్తున్నారు, ఇందులో  ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. తనకు రెండు రాష్ట్రాల్లో గుర్తింపును వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కల్పించారని, పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వేరే పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కార్యకర్తలకు న్యాయం చేయాలన్న తపన తనదని, అయితే కొందరు నందికొట్కూరులో పెత్తనం చెలాయిస్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి..మూడు నెలలైందని, తాను రెండు నెలలు  నియోజకవర్గంలోనే లేనని, ఆధిపత్యం ఎలా చెలాయిస్తానని ప్రశ్నించారు. అధికారులు ఎవరికీ ఫలాన పని చేయాలంటూ ఫోన్‌ చేసిన సందర్భాలు లేవన్నారు. తనపై తెర వెనుక భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను దళిత వ్యతిరేకి అనే ప్రచారం చేయొచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, కుటుంబ సభ్యులను, తన వెంట ఉండే కార్యకర్తలనూ ఇబ్బందులకు గురి చేశారన్నారు. మిడుతూరు మండలానికి హంద్రీ–నీవా నీరు తీసుకురావడం, శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేసేందుకు జీఓ నంబర్‌ 98 కింద ఉద్యోగాల కల్పన, మున్సిపాలిటీలో పెంచిన పన్ను భారాన్ని తగ్గించడం, నందికొట్కూరు రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించడం.. తన ముందున్న లక్ష్యాలని పేర్కొన్నారు. పార్టీ కోసం సమష్టిగా పని చేసి వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో నందికొట్కూరులో వైఎస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement