నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించిన వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం తథ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పెట్రోల్‌బంక్ వెనక ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమపార్టీ ఆధ్వర్యంలో అటల్‌బిహరీవాజ్‌పేయి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను ఒప్పించి మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందన్నారు. దశాబ్దాలకాలాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ప్రస్తుతం నాలుగు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతుంది. కాని కేవలం పన్నెండేళ్లుగా నరేంద్రమోడి పాలిస్తున్న గుజరాత్‌లో 24గంటలపాటు త్రీఫేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తున్నారన్నారు. అనంతరం మండలంలోని పలుగ్రామాలకు చెందిన పలువురు ఇతర పార్టీల నుంచి యెండల సమక్షంలో బీజేపీలో చేరారు.
బంగారు తెలంగాణను చూడాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడదేమోననే బెంగతో గ్రామాల్లో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, త్వరలోనే ఏర్పడనున్న బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని చూసేందుకైనా యువకులు ఆత్మహత్యలు మానాలని బీజేపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి బాణాల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో కేంద్రం, రాష్ట్రంలో నరేంద్రమోడి ఆధ్వర్యంలో తమ పార్టీ అధికారంలోకి రానుందని, అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అత్యంత క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. వంశపారంపర్యత, కుటుంబపాలన తమ పార్టీలో ఉండదన్నారు. కాంగ్రెస్‌పార్టీ పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల భాగయ్య, జిల్లా కార్యదర్శి మర్రి బాల్‌కిషన్, అసెంబ్లీ కన్వీనర్ నర్సింహరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆలే భాస్కర్, ఎల్లారెడ్డి సర్పంచ్ దేవేందర్, స్థానిక నేతలు బాపూరావు, బాలాజీ, నరేందర్‌రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటు తథ్యం
Published Mon, Dec 23 2013 3:32 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement