
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైందని, చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రోజు వారీ ఖర్చులతో పాటు రెవెన్యూ రంగాలకు వ్యయం చేయడంతో ఆర్థిక వ్యవస్థ బలహీనమైపోయే ప్రమాదం ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. మార్చితో ముగిసిన 2016– 17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. రూ.17,231 కోట్ల అప్పులు చేసి రెవెన్యూ వ్యయానికి వెచ్చించిందని కాగ్ పేర్కొంది.
2016–17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ వ్యయం రూ.1,14,168 కోట్లుగా పేర్కొనగా, వాస్తవంగా రెవెన్యూ వ్యయం అంచనాలకు మించి రూ.1,16,215 కోట్లకు చేరిందని నివేదికలో స్పష్టం చేసింది. రెవెన్యూ వ్యయంలో 85.17 శాతాన్ని రెవెన్యూ రాబడుల నుంచి ఖర్చు చేయగా, మిగిలిన ఖర్చును రుణాల ద్వారా సేకరించిన నిధుల నుంచి చేశారని కాగ్ ఎత్తిచూపింది. రుణాలు ఎక్కువగా చేస్తున్నారని, ఇది ప్రజా రుణంలో పెరుగుదలను సూచిస్తోందని, రానున్న సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ రుణ బాధ్యతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. 2016–17లో రెవెన్యూ ఖర్చు అంతకు ముందు ఆర్థిక ఏడాది కంటే రూ.20,265 కోట్లు పెరిగిందని ఎత్తిచూపింది. రుణాల ద్వారా సమకూర్చుకున్న నిధులను రెవెన్యూ ఖర్చు కోసం వినియోగిస్తే వీటి నుంచి ఎలాంటి ఆస్తులూ ఏర్పాటు కాకుండానే రానున్న సంవత్సరాల్లో తీర్చాల్సిన రుణ భారం పెరిగేందుకు దారితీస్తుందని కాగ్ పేర్కొంది.
సామాజిక రంగాలకు అన్యాయం!
సామాజిక రంగంలోని విద్య, ఆరోగ్యం, సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం రంగాలపై చేసిన కేపిటల్ వ్యయం మొత్తం ఖర్చులో 4.62 శాతమే ఉందని, దీంతో సామాజిక రంగానికి తక్కువ నిధులు కేటాయించినట్లు కాగ్ పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రుణ బాధ్యతల విలువ రూ.2,01,314 కోట్లు అని, ఇది రెవెన్యూ రాబడులకు 2.03 రెట్లు, జీఎస్‌డీపీలో 28.79 శాతంగా ఉందని కాగ్ పేర్కొంది. అప్పులను తక్కువగా చూపించేం దుకు రాష్ట్రం ప్రయత్నిస్తోందని కాగ్ తప్పుప ట్టింది. బడ్జెట్‌లో వెల్లడించని రుణాలు రూ.11,867 కోట్లు, గ్యారెంటీ ఇచ్చిన రుణ బకాయిలు రూ.9,665 కోట్లు కలుపుకుని చూస్తే రుణ చెల్లింపుల బాధ్యతలు రూ.2,22,845 కోట్లు అని స్పష్టం చేసింది. 2016–17 సంవత్సరానికి జీఎస్‌డీపీతో ఈ చెల్లింపు బాధ్యతల నిష్పత్తి 31.87 శాతంగా ఉందని వెల్లడించింది.
కాగ్ ఇంకా ఏం చెప్పిందంటే..
- సొంత రెవెన్యూ వనరుల కంటే రుణాల రాబడుల మీదే ప్రభుత్వం అధికంగా ఆధారపడిందని సూచికలన్నీ స్పష్టం చేస్తున్నాయి.
- సమృద్ధమైన ఆర్థిక పరిస్థితికి దోహదపడేలా, వనరుల సమీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం పెంపొదించుకోవాలి.
- రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు మూల ధన ఆస్తుల ఏర్పాటు కంటే రోజువారీ కార్యకలాపాలపై పెరిగింది.
- 2016–17లో కేపిటల్ వ్యయం 11.48 శాతం. ఇది సాధారణ వర్గం రాష్ట్రాల సమష్టి సగటు 19.70 శాతం కన్నా చాలా తక్కువ.
- 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వానికి 2016–17లో రూ.4,370 కోట్ల మేర ఎక్కువ నిధులు సమకూరినప్పటికీ, ఈ నిధులను మూలధన ఆస్తుల ఏర్పాటుకు ఉపయోగించలేదు.
- రానున్న ఏడు సంవత్సరాల్లో 50 శాతానికి మించి రూ.76,888 కోట్ల రుణాలను తీర్చాల్సి ఉండటం ఆయా సంవత్సరాల్లో బడ్జెట్‌పై భారం మోపనుంది.
Comments
Please login to add a commentAdd a comment