వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి
కారంపూడి : కాల్‌మనీ వ్యవహారంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం దాన్ని వదిలేసి రాష్ట్రవ్యాప్తంగా ఫైనాన్స్ సంస్థలు నడుపుతున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలపై పోలీసు సోదాలు నిర్వహిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. వడ్డీ వ్యాపారులను ఇందులో ఇరికించి అన్ని పార్టీల పాత్ర వుందని చెబుతూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం విఫల యత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కారంపూడిలో గురువారం రాష్ట్రస్థాయి ఎండ్ల పందేలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం దగ్గర కాల్ మనీ నిందితుల పూర్తి సమాచారం వుందన్నారు. కాలయాపన చేస్తే ప్రజలు మర్చిపోతారని హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తానంటోందని ఆరోపించారు. గుంటూరులో వడ్డీ వ్యాపారంతో సంబంధం లేని వైఎస్సార్‌సీపీ యువజన విబాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించడంతోనే ప్రభుత్వ వైఖరి స్పష్టం అవుతోందన్నారు.
ఇలాగానే ఆదుకునేది.. పత్తి ఎకరాకు ఐదు క్వింటాళ్లు దిగుబడి వచ్చి కుమిలి పోతుంటే కనీస మద్దతు ధర రూ.4,100 సీసీఐ కేంద్రాల్లో కూడా ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. కష్టకాలంలో క్వింటాకు ఆరువేలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలనే ఆలోచన లేదన్నారు. పత్తి వ్యాపారి వ్యవసాయ మంత్రి ఐతే పరిస్థితి ఇలాగే వుంటుందని రాజశేఖర్ ఎద్దేవా చేశారు
నిందితులను రక్షించేందుకే.. : జంగా కృష్ణమూర్తి
గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అప్పులు ఇచ్చి పుచ్చు కోవడం అనాదిగా వస్తోందని, అసలు అలా చేయడమే తప్పు అన్నట్లుగా పోలీసు తనిఖీల ద్వారా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. ఇదంతా కాల్‌మనీ నిందితులపై చర్యలు తీసుకోకుండా ఉంటేందుకు ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగా పేర్కొన్నారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు బంధువులను బినామీలుగా రంగంలోకి దించి మట్టి నుంచి బ్రాందీ షాపుల వరకు అందర్ని దోచుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కూడా తన తనయుడి ద్వారా దోచుకో దాచుకో పద్ధతికి తెరతీసి మిగతా ప్రభుత్వ పెద్దలకు తప్పుడు మార్గం చూపారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు గజ్జెల బ్రహ్మారెడ్డి, నియోజకవర్గ, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
‘కాల్‌మనీ’ని నీరుగార్చేందుకు కుట్ర
Published Fri, Dec 18 2015 12:25 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement