కాల్‌మనీ కేసులను అడ్డుపెట్టుకుని భారీగా దండుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది
కానిస్టేబుల్ రమేష్ అరెస్ట్‌తో వెలుగులోకి
సీపీకి మరో నాలుగు ఫిర్యాదులు
ప్రజల నుంచి అక్రమ వడ్డీల రూపంలో అడ్డంగా దోచుకుంటున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కాల్‌మనీ నిందితులను అప్పట్లో అరెస్టు చేశారు. దీనిని అడ్డు పెట్టుకుని పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి కేసుకూ ఒక రేటు నిర్ణయించి కాల్‌మనీ నిందితుల నుంచి లక్షల్లో దండుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులపై ఇప్పుడు కమిషనరేట్‌కు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది.
విజయవాడ : కాల్‌మనీ కేసుల్లో సీన్ రివర్స్ అయింది. నాడు అధిక వడ్డీల నేపథ్యంలో పలువురిపై ఫిర్యాదులు వెల్లువెత్తితే.. నేడు పోలీసులపై ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాల్‌మనీ పేరుతో అధిక వడ్డీలు గుంజుతున్నారంటూ కేసులు నమోదైన వారినుంచి పోలీసులే భారీగా దండుకోగా, ఇప్పుడు ఆ వ్యవహారం బట్టబయలవుతోంది. ముఖ్యంగా టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పొట్లూరి రమేష్ అవినీతిపై విజయవాడ కమిషనరేట్ పోలీసులకు ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. కానిస్టేబుల్ పొట్లూరి రమేష్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్ పేరు చెప్పి మరీ బాధితుల నుంచి వసూలు చేశాడనే ఆరోపణలు ఇప్పుడు కమిషనరేట్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. కాల్‌మనీ కేసుల్లో అరెస్టయిన, పోలీస్ విచారణకు హాజరైన నలుగురు వ్యక్తులు తాజాగా శుక్రవారం ఏసీపీపై విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికి ఐదు ఫిర్యాదులు అందాయి.
బెదిరించి.. భయపెట్టి..
టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి గత నెలలో తోటవల్లూరుకు బదిలీ అయిన కానిస్టేబుల్ పి.రమేష్‌ను మూడు రోజుల కిత్రం అవినీతి ఆరోపణలతో కమీషనరేట్ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసుల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పర్యవేక్షించారు. ప్రధానంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్‌తో ఆయన టీమ్ ఎక్కువ కేసుల్ని విచారించారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్‌లో దీర్ఘకాలం పనిచేసిన రమేష్ కాల్‌మనీ ఫిర్యాదులు వచ్చిన వారందరినీ బెదిరించి భయభాంత్రులకు గురిచేశాడని, ఏసీపీ, ఇతర అధికారులు డబ్బులు అడుగుతున్నారంటూ భారీగా వసూళ్లు చేశాడని వెల్లడవుతోంది.
ఫిర్యాదుల వివరాలివీ...
కానిస్టేబుల్ రమేష్ గొల్లపూడిలోని తన నివాసంలో శానిటరీ మరమ్మతులు చేయించటానికి అవసరమైన రూ.2 లక్షల సామగ్రిని బెదిరించి మరీ కొనుగోలు చేశాడంటూ కాల్‌మనీ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన కోనేరు అనిల్‌కుమార్ ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాత్ స్టయిల్స్‌లో వీటిని తాను అప్పుతో కొని ఇచ్చానని, రమేష్ పేరుతో ఉన్న బిల్లులను ఇవ్వాలంటూ షాపు యజమానిని ఈ నెల 16న ఫోనులో బెదిరించాడని పేర్కొన్నారు. దీనిపై బిల్లులను ఫిర్యాదు కాపీతో కలిపి పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. తన బావమరిదిని కూడా ఇదే తరహాలో వేధిస్తే రూ.2 లక్షలు ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తనను ఇబ్బంది పెట్టారంటూ విజయవాడ పటమటకు చెందిన యలమంచలి రమేష్ ఫిర్యాదు చేశారు. కాల్‌మనీ కేసుల్లో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు చిన్ననాటి స్నేహితుడని, శ్రీకాంత్ పరారీతో తనను, తన స్నేహితులైన అశోక్, సుమన్‌లను టాస్క్‌ఫోర్స్ విచారణ పేరుతో పిలిపించి ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. చివరికి కానిస్టేబుల్ రమేష్.. నారాయణ అనే వ్యక్తిని పంపి రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారని, లక్ష రూపాయలు తీసుకున్నారని వివరించారు.
పటమటలో సూపర్‌బజార్ నిర్వహించే యలమంచలి సుమన్ కూడా తనను వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు అందజేశారు. కానిస్టేబుల్ రమేష్.. నారాయణ అనే వ్యక్తి ద్వారా రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, చివరికి రూ.50 వేలు తీసుకొని వదిలేశారని వివరించారు. వెనిగళ్ల శ్రీకాంత్‌కు తాను స్నేహితుడిని కావటంతో వేధించారని తెలిపారు.
కాల్‌మనీ కేసు నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ సోదరుడు వెనిగళ్ల శ్రీరామ్ తన నుంచి రెండు విడతలుగా రూ.80 వేలు వసూలు చేశాడని ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌తో తనకు మాటలు లేవని, అతనితో ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పినా వినకుండా కానిస్టేబుల్ రమేష్ ఇబ్బంది పెట్టాడని వివరించారు.