సాక్షి ప్రతినిధి, కర్నూలు: సాధారణంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన వెంటనే సరఫరా చేసి వినియోగదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప విద్యుత్‌ను నిల్వ చేసే అవకాశం ఇప్పటివరకు అందుబాటులో లేదు. కాకుంటే చిన్న చిన్న బ్యాటరీల్ని ఏర్పాటు చేసుకుని ఇన్వర్టర్ల ద్వారా గృహావసరాలకు మాత్రమే విద్యుత్‌ను నిల్వ చేసుకునే వీలుంది. అంతేతప్ప భారీస్థాయిలో మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ను నిల్వ చేసుకునే ప్రాజెక్టేదీ ఇంతవరకూ రాష్ట్రస్థాయిలో ఎక్కడా లేదు. అయితే తాజా సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో విద్యుత్‌ను నిల్వ చేసేందుకోసం ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనూ విద్యుత్‌ను నిల్వ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా సౌర విద్యుత్‌ను నిల్వ చేయాలని ఇంధనశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ పేరుతో 5 మెగావాట్ల విద్యుత్ నిల్వ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. నెల్లూరు లేదా విజయనగరం జిల్లాలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఇంధనశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మొదటిసారిగా రాష్ట్రంలో తలపెట్టిన ఈ విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకోసం టెండర్ల ప్రక్రియను సైతం ప్రారంభించారు. ఇందుకోసం పలు కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. 5 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటును నెలకొల్పడంతోపాటు బ్యాటరీలద్వారా విద్యుత్‌ను నిల్వ చేయాల్సి ఉంటుంది. దీని ఏర్పాటుకుగాను మెగావాట్‌కు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే విద్యుత్‌ను కూడా నిల్వ చేసుకుని అవసరమైన సమయాల్లో సరఫరా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా కరెంటు కష్టాలను అధిగమించడానికి వీలవుతుంది. అయితే థర్మల్ విద్యుత్ కేంద్రాల(బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు) సామర్థ్యం భారీస్థాయిలో ఉంటుంది కాబట్టి.. సౌర విద్యుత్ వైపుగా ఈ ప్రయోగం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.