
రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 2023లో ప్రభుత్వం 90 శాతం ఉచిత విద్యుత్‌ను అందించినట్లు పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించినప్పటి నుంచి ప్రతినెలా గృహాల్లో సరాసరి 300 యూనిట్లకు బదులు 600 యూనిట్ల కరెంట్ అధికంగా సరఫరా అవుతుందన్నారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్) ఆధ్వర్యంలోని అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,873 కోట్లతో పంపిణీ వ్యవస్థలను పునరుద్ధరించినట్లు తెలిపారు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇతర సంస్థలతో పవర్‌పర్చేజ్ అగ్రిమెంట్లపై సంతకం చేసిందని చెప్పారు. దాంతో 1,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. పంజాబ్ 2023లో అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. గరిష్ఠంగా జూన్ 23, 2023న 15,293 మెగావాట్ల విద్యుత్ అవసరమైనట్లు తెలిసింది.