ఛార్జింగ్ కూడా షేర్ చేయొచ్చు!
యాండ్రాయిడ్ ఫోన్ల ప్రపంచం విస్తరించింది. ప్రతి మనిషికీ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో జనం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయిపోతున్నారు. ఫోన్ కాల్స్ మాట్లాడటమే కాక వాయిస్ మెసేజిలు పంపడంతో పాటు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫోన్ బ్యాలెన్స్‌ను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే టెక్స్ట్, ఫొటోలు, వీడియోలతో పాటు.. తాజాగా ఫోన్ ఛార్జింగ్ ను సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని లండన్ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు.
అత్యవసర సమయాల్లో ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇకముందు ఉండవట. ఫోన్ చార్జింగ్ ను షేర్ చేసుకునే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఫోన్ లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోయినపుడు ఇతరుల ఫోన్ నుంచి ఎటువంటి వైర్, కేబుల్ అవసరం లేకుండా పవర్ షేర్ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పవర్ షేక్ పేరుతో లండన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి పరుస్తున్న కొత్త వైర్ లెస్ టెక్నాలజీని త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు. పవర్ ట్రాన్స్ మిట్ కాయిల్స్ ద్వారా ఒక మొబైట్ ఫోన్ నుంచి మరో మొబైల్ ఫోన్ కు కరెంట్ ప్రసరింపజేసే కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఫోన్ పక్కనే మరో ఫోన్ ఉంచి 12 సెకన్లపాటు షేర్ చేసిన పవర్.. ఒక నిమిషం పాటు కాల్ మాట్లాడేందుకు వినియోగిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.