
సీమలో రాజధాని
సాక్షి, అనంతపురం : ‘కోస్తా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడి రైతులు వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తుంది. పంట భూములను ఇతర అవసరాలకు వాడటం ప్రమాదకరం. దానివల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. పైగా కోస్తాలో భూముల ధరలూ ఎక్కువే. అదే అనంతపురం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు జిల్లాలో అనుకూలాంశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ రాజధాని ఏర్పాటు సాధ్యం కాకపోతే.. కనీసం రెండవ రాజధాని ఏర్పాటు చేయండి. అప్పుడు మాత్రమే జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుంది.
ఉపాధి అవకాశాలు మెరుగవుతాయ’ని శివరామక్రిష్ణన్ కమిటీ సభ్యులకు జిల్లాలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, మేధావులు, విద్యార్థులు విన్నవించారు. రాష్ట్ర రాజధాని ఎంపికపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన శివరామక్రిష్ణన్ కమిటీ సభ్యులు కె.నితిన్, అరోమర్ రెవీ, రవీంద్రన్, జగన్‌షా మంగళవారం అనంతపురంలో పర్యటించారు. సోమవారం రాత్రి న గరానికి చేరుకున్న వారు ఆర్డీటీ అతిథి గృహంలో బస చేశారు. మంగళవారం ఉదయం నగరంలో పర్యటించారు. తొలుత బుక్కరాయసముద్రం చెరువును పరిశీలించారు. ఆ తర్వాత బైపాస్‌రోడ్డు, టవర్ క్లాక్ సర్కిల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఆర్ట్స్ కళాశాల తదితర ప్రాంతాలను సందర్శించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ విప్ యామినీ బాల, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాష, టీడీపీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, వరదాపురం సూరి, ఈరన్న, జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీలు గేయానంద్, శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి, సీపీఐ నాయకుడు రమణ, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తదితరులు తమ డిమాండ్లను కమిటీ సభ్యుల ముందుంచారు. అన్ని రంగాలలో వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధి చెందాలంటే రెండవ రాజధాని ఏర్పాటు చేసి తీరాలన్నారు.
‘ఇప్పటికే మా రక్తమాంసాలను సైతం అమ్ముకున్నాం. ఇక అమ్ముకోవడానికి ఏమీ లేవు. మిగిలింది మా ప్రాణాలే. అనంతపురానికి రాజధాని ఇవ్వలేకపోతే రెండవ రాజధాని ఏర్పాటు చేయాల’ని కోరారు. ‘సార్..మాకు రెండవ రాజధాని ఇప్పించండి ప్లీజ్’ అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు విన్నవించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కోస్తాంధ్రలో రాజధాని ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో మళ్లీ ప్రత్యేక వాదం తలెత్తే అవకాశం ఉందన్నారు.అదే జరిగితే రాయలసీమ, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలు మరోసారి మోసపోవడమే కాకుండా, అభివృద్ధి పరంగా పూర్తిగా వెనుకబడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎవరిని మభ్యపెట్టడానికి?
శివరామక్రిష్ణన్ కమిటీ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పర్యటించిన తరువాత రాయలసీమకు రావడంపై సీపీఐ (న్యూ డెమొక్రసీ), పలువురు ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. రాజధాని ఎక్కడన్నది ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, కమిటీ పర్యటన ఎవరిని మభ్యపెట్టడానికి అని ప్రశ్నించారు.
‘అనంత’ అన్నివిధాలా అనుకూలం
రాజధాని ఏర్పాటుకు అనంతపురం జిల్లా అన్ని విధాలా అనుకూలమని నేతలు వివరించారు. గుత్తి నుంచి హిందూపురం వరకు భూములు విస్తారంగా అందుబాటులో ఉన్నాయన్నారు. మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గం, హిందూపురం, పెనుకొండ, కదిరి ప్రాంతాలలో వేలాది ఎకరాల ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయని, దీంతో కొనుగోలు సమస్య తప్పుతుందని వివరించారు. వీటిలో రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం పట్టుచీరలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. మౌలిక వసతుల పరంగా రైల్వే, రోడ్డు రవాణా వంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ కూడా జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు.
ఈ డివిజన్‌ను జోన్‌గా మార్పు చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం జిల్లాకు దగ్గరగా ఉందని, పుట్టపర్తి ఎయిర్‌పోర్టును కూడా అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. అనంతపురాన్ని రెండవ రాజధానిగా చేయని పక్షంలో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ విన్నవించారు. సత్యసాయి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసేలా కమిటీ సహకరించాలన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సైతం ఇదే డిమాండ్‌ను కమిటీ ముందుంచారు.