పుష్కర స్నానం ఆచరించడానికి కుటుంబంతో వచ్చిన ఓ లండన్ వైద్యుడి కారు, నగలు తీసుకుని డ్రైవర్ పరారైన సంఘటన శనివారం చోటు చేసుకుంది.
తూర్పుగోదావరి (రాజమండ్రి) : పుష్కర స్నానం ఆచరించడానికి కుటుంబంతో వచ్చిన ఓ లండన్ వైద్యుడి కారు, నగలు తీసుకుని డ్రైవర్ పరారైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన డాక్టర్ రెడ్డి నారాయణచౌదరి లండన్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో ఇండియాకు వచ్చారు. పుష్కర స్నానం చేసేందుకు మండపేట నుండి శనివారం ఉదయం 6.30 గంటలకు కారులో భార్య, తల్లి, స్నేహితుడితో కలిసి బయలుదేరి 8 గంటలకు రాజమండ్రి చేరుకున్నారు. నగరంలోని టి.నగర్ ఉడిపి అక్షయ హోటల్ వద్ద కారు నిలిపారు. కారు వద్ద రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లికి చెందిన డ్రైవర్ గౌతమ్‌కృష్ణను ఉంచి వీఐపీ ఘాట్‌కు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు.
తిరిగి 10.30 గంటలకు వచ్చి చూడగా ఏపీ 28 డీఆర్ 4408 నంబరు గల కారు కనిపించలేదు. డ్రైవర్ నంబర్‌కు ఫోన్ చేయగా.. రెండుసార్లు రింగైన అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కారు గురించి బైక్పై రాజమండ్రిలో వెతికారు. కారు, డ్రైవర్ జాడ తెలియకపోవడంతో నారాయణ చౌదరి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో లండన్ నుంచి తీసుకువచ్చిన సుమారు రూ.5.50 లక్షల విలువైన డైమండ్ రింగులు, చెవి కమ్మలు, నగలు, రూ.60 వేల నగదు, సెల్‌ఫోన్‌లు ఉన్నాయని తెలిపారు. గౌతమ్‌కృష్ణ ఈ నెల 13 నుంచి తమ కారుకు ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అదే రోజు అతడి ఫొటో, లెసైన్స్ వాట్సప్‌లో తీశామని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.