కడియం సీఐపై అట్రాసిటీ కేసు | case filed on ci | Sakshi
Sakshi News home page

కడియం సీఐపై అట్రాసిటీ కేసు

Published Fri, Apr 11 2014 3:46 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఐ తనను కులం పేరుతో దూషించారని, పిస్టల్ గుండెలకు గురిపెట్టి భయాందోళనకు గురిచేశారని స్టాలి న్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కడియం, న్యూస్‌లైన్ : కడియం ఇన్‌స్పెక్టర్ ఎన్‌బీ మురళీకృష్ణపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈనెల ఆరో తేదీన ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సమయంలో సీఐ తనపై అనుచితంగా ప్రవర్తించారని వైఎస్సార్ సీపీ నాయకుడు, న్యాయవాది యాదల సతీష్‌చంద్రస్టాలిన్ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లిన స్టాలిన్ డీఎస్పీ ఎన్ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సీఐ మురళీకృష్ణపై అట్రాసిటీ కేసు నమోదుచేసారు.
 
టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఐ తనను కులం పేరుతో దూషించారని, పిస్టల్ గుండెలకు గురిపెట్టి భయాందోళనకు గురిచేశారని స్టాలిన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కడియం ఎస్సై టి. నరేష్ 9వ తేదీన కేసు నమోదు చేశా రు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఎన్‌బీ మురళీకృష్ణ కడియం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వచ్చింది మొదలు దురుసుగా వ్యవహరిస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 
ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ర్యాలీ లను చూసీచూడనట్టు వదిలేసిన ఈ అధికారి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను మా త్రం లక్ష్యంగా చేసుకుని వేధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ నాయకులు కావాలనే ఆయనను ఇక్కడికి తెచ్చుకున్నారనే ప్రచారం జరిగింది. మురళీకృష్ణ కూడా ఇందుకు తగ్గట్టే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో జనం నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
విధుల నుంచి తప్పించాలి
అట్రాసిటీ కేసులో నిందితుడైన మురళీకృష్ణను తక్షణం విధులనుంచి తప్పించి నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేందుకు దోహదం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. కేసు విచారణ సమయంలో ఇక్కడే విధులు నిర్వహిస్తుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈమేరకు చర్యలు తీసుకోవాలని డీజీపీని కలసి కోరినట్టు స్టాలిన్ విలేకరులకు చెప్పారు. పోలింగ్ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్న తనను జేగురుపాడు ఎస్సీ కాలనీ పోలింగ్‌బూత్ వద్ద సీఐ అకారణంగా దూషించి, అమానుషంగా ప్రవర్తించారన్నారు.
 
పోలింగ్‌లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. సీఐ అనుచిత వ్యవహార శైలి, కడియం స్టేషన్‌లో అవకతవకలను డీజీపీకి వివరించినట్టు స్టాలిన్ తెలిపారు. రాజమండ్రిలో ఎస్సైగా పనిచేసిన సమయంలో కూడా మురళీకృష్ణపై పలు ఆరోపణలున్నాయని, అనుచిత ప్రవర్తన కారణంగా గతంలో సస్పెండ్ అయ్యారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement