మనోడైతే నో కేస్‌ | Cases dropped in Speaker Kodela Shiva Prasada Rao | Sakshi
Sakshi News home page

మనోడైతే నో కేస్‌

Published Fri, May 12 2017 1:55 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

మనోడైతే నో కేస్‌ - Sakshi

మనోడైతే నో కేస్‌

టీడీపీ నేతలపై కేసుల ఎత్తివేత
పాతకేసులు ఎత్తేస్తూ మూడేళ్లలో 132 జీవోలు
కేసులు తొలగినవారిలో స్పీకర్‌ కోడెల
మండలి వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం కూడా..
మంత్రులు దేవినేని, కొల్లు, అచ్చెన్నాయుడుకు ఊరట
ప్రతిపక్షంలో ఉండగా కేసు.. పార్టీ మారితే ఉపసంహరణ


సాక్షి, అమరావతి : ప్రతిపక్షం చేస్తున్న ప్రజా పోరాటాలను కర్కశంగా అణచివేయడం చూస్తున్నాం.. ప్రత్యేకహోదా సాధన కోసం జరిగే కొవ్వొత్తుల ర్యాలీకి సంఘీభావం తెలపడానికి వెళుతున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వేపైనే అడ్డగించడం చూశాం.. మహిళా పార్లమెంటు కు హాజరుకానీయకుండా ఎమ్మెల్యే రోజాను మాయమాటలు చెప్పి విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని దారులు మార్చి హైదరాబాద్‌కు తరలించడం చూశాం..

 ప్రయాణీకుల తరఫున మాట్లాడి వారి సమస్యలు తీర్చడం కోసం ప్రయత్నించిన ఎంపీ మిథున్‌ రెడ్డి విమానాశ్రయ మేనేజర్‌పై దాడి చేసినట్లు అక్రమ కేసు బనాయించడం చూశాం... కృష్ణాజిల్లా బస్సు ప్రమాద మృతులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్షనేత అక్కడ అవకతవకలపై నిలదీస్తే కలెక్టర్‌కు అడ్డుతగిలారంటూ బూటకపు కేసులు పెట్టడం చూశాం.. అదేసమయంలో మరోవైపు టీడీపీ నేతలు అధికారులపై దాడులు చేసినా.. ఇసుక, మట్టి వంటి సహజవనరులను దోచుకుంటూ అధికారులను బెదిరించినా, ఏర్పేడు వంటి ఘటనల్లో ఎంతో మంది మరణానికి కారకులైనా..

 బాలసుబ్రహ్మణ్యం వంటి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై నడిరోడ్డుపైనే దాడి చేసి బెదిరించినా కనీసం కేసులు పెట్టని పరిస్థితి. వనజాక్షి నుంచి బాలసుబ్రహ్మణ్యం వరకు అధికారులపై ఎలాంటి దాడులకు దిగుతున్నారో చూశాం. కానీ అధికారపక్షం ఇంతటితో ఆగడం లేదు... మనోడేనా అయితే కేసూ గీసూ లేదు.. తీసేయమంటూ బరితెగిస్తోంది.  అందుకోసం ప్రత్యేక జీవోలు జారీ చేస్తోంది.  మూడేళ్లలో ఏకంగా 132 జీవోలు జారీ చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కేసుల తొలగింపు ఈ స్థాయిలో జరగడం ఎప్పుడూ ఎరగమని అధికారు లంటున్నారు.
   
ఎందరో ప్రముఖులు..  
శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై నరసారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మూడు కేసులు, శాసనమండలి వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యంపై ఉన్న కేసు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఉన్న రెండు కేసులు, మంత్రులు దేవినేనిపై ఐదు కేసులు, కొల్లు రవీంద్రపై మూడు కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవోలిచ్చింది. వారితోపాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులను ఎత్తివేశారు.

పోలింగ్‌ నిలిపేసిన దేవినేని
మూలపాడు పంచాయతీ ఎన్నికల్లో ఆందోళనకు దిగి రెండు గంటలపాటు పోలింగ్‌ నిలిచిపోయేలా వ్యవహరించి, ఉద్రిక్తత పరిస్థితికి కారణమైన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై 2013లో ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు నమోదైంది. దీనితోపాటు  విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లలో 178/2014, 959/2012, 403/2013, 93/2005 క్రైమ్‌ నెంబర్లతో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తూ 2015 జూన్‌ 4న జీవో నెంబర్‌ 647 జారీ చేసింది.

టీడీపీలోకి ఫిరాయిస్తే:  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గా ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో పాటు మరో 20 మందిపై 2014 జూన్‌ 30న గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కుట్రపూరి తంగా గుమిగూడి, ప్రభుత్వ ఆస్తులను,  తగలబెట్టడం కారణాలు చూపి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మరో 20 మందిపై గిద్దలూరు పోలీసులు వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.  ఆయన టీడీపీలో చేరడంతో ప్రభుత్వం కేసును ఉపసంహరించు కుంటూ జీవో.379ను జారీ చేశారు.  

పోలీసులపై దాడి చేసిన కోడెల
ప్రస్తుత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన అనుచరులతో నరసరావుపేటలో 2009లో ధర్నా చేయడంతో అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కోడెల అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను నెట్టడం, పోలీస్‌ స్టేషన్‌పై రాళ్లు రువ్వడం, విధులకు ఆటంకం కల్పించిన అభియోగాలపై కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్లతోపాటు 353 నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌పై కేసు పెట్టడంతోఅప్పట్లో  కోడెల గుంటూరు సబ్‌జైలులో కొద్ది రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఆ కేసులను బాబు అధికారంలోకి వచ్చాక ఎత్తేసింది. ఇలాంటి ఉదాహరణలెన్నో..

మహిళపై దాడి చేసిన అచ్చెన్నాయుడు
2008 ఆగస్టు 11న కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సర్పంచ్‌ కింజరాపు గణేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద   పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు దీన్ని అడ్డుకున్నారు.  పాఠశాల ఆవరణలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని పట్టుబట్టారు. ఘర్షణ చోటు చేసుకో వడంతో సర్పంచ్‌ గణేశ్వరరావు కుమార్తె మేనకపై అచ్చెన్నాయుడు దాడి చేసి అవమానపరిచారు. ఆయనపై ఎఫ్‌ఐ ఆర్‌ నంబర్‌ 150/2008 ప్రకారం 354, 323, 506(1) అండ్‌ (2) రెడ్‌ విత్‌ 34 సెక్షన్‌ల ప్రకారం మహిళను అవమానపరచే విధంగా ప్రవర్తించడం, శారీరకంగా గాయపరచడం, బెదిరించి చనిపోయే విధంగా దాడి చేయడం ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement