ఆస్పత్రులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చలు
3న మళ్లీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. దీనిపై ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం తన నివాసంలో చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. పథకానికి కార్పొరేట్ ఆస్పత్రులు సహకరించాలని మంత్రి కామినేని కోరారు.
ప్యాకేజీ రేట్లు, ఓపీ సేవలు, మందుల సరఫరా లాంటి విషయాల్లో తమకు ఇబ్బందులున్నాయని ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతినిధులు మంత్రికి తెలిపారు. హెల్త్ కార్డులు ఇచ్చినా ఇప్పటికీ నగదు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు. ఈ నేపథ్యంలో జనవరి 3వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. జనవరి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పథకం అమలు కావాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమణమూర్తి, రెవెన్యూ ఉడ్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్‌జీవో విజయవాడ శాఖ అధ్యక్షుడు సాగర్, సహకార శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఫణి పేర్రాజు, యూటీఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు తదితరులు మంత్రితో చర్చల్లో పాల్గొన్నారు.
వాజ్‌పాయ్‌కి భారతరత్నపై హర్షం
మాజీ ప్రధాని వాజ్‌పేయి, మదన్‌మోహన్ మాలవీయలకు భారతరత్న పురస్కారం ప్రకటించడంపై మంత్రి కామినేని హర్షం ప్రకటించారు.