ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత చికిత్స ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడడం లేదు.
నగదు రహిత చికిత్సకు నో అంటున్న ప్రధాన ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత చికిత్స ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడడం లేదు. హెల్త్ కార్డులు జారీచేసినా పాత పద్ధతిలోనే ముందుగా డబ్బులు చెల్లిస్తూ చికిత్స చేయించుకుంటున్నారు. ఆ తర్వాత మెడికల్ బిల్లులు సమర్పించి రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 12 ప్రధాన ఆసుపత్రులు ఈ నగదు రహిత ఆరోగ్య కార్డుల ఉద్యోగుల చికిత్సకు అంగీకరించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ ఆసుపత్రులకే చాలా మంది ఉద్యోగులు ఎగబడుతున్నారు. అయితే ప్యాకేజీలు తమకు సరిపోవని... కనీసం 25 శాతం పెంచాలని ఆ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో ఆరోగ్యకార్డుల ద్వారా,పాత పద్ధతిలోనూ చికిత్సకు ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని ఈ నెలాఖరు వరకు కొనసాగించిన ప్రభుత్వం... ఇదే విధానాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య కార్డులను ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చింది. దాదాపు 230 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకు ఒప్పుకున్నాయి. అయితే 12 ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులు దీనికి అంగీకరించడంలేదు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు చికిత్స కాబట్టి సామాజిక బాధ్యతగా ప్యాకేజీలు తక్కువగా ఉన్పప్పటికీ తాము అంగీకరించామని... భారీగా వేతనాలున్న ఉద్యోగులకూ ఈ ప్యాకేజీనే అమలు చేయడం సాధ్యంకాదంటున్నాయి. అందువల్ల వీటికి 25 శాతం పైగా పెంచాలని కోరుతున్నాయి. ఒకవేళ ప్యాకేజీ సొమ్మును పెంచితే అన్ని ఆసుపత్రులకూ అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భయపడుతుంది.
సమస్యకు ఉద్యోగ సంఘాల మూడు పరిష్కారాలు
1. కేంద్ర ఉద్యోగులకు ఇచ్చే ప్యాకేజీని అమలు పరచడం
2. నిమ్స్ ఆసుపత్రుల్లో మిలీనియం బ్లాక్ ప్యాకేజీని అమలు చేయడం
3. బీమా సంస్థల ప్యాకేజీని అమలు చేయడం