
ఆద్యంతం అలరించిన శ్రీకృష్ణలీలలు
చోడవరం : ఆకాశం పైనుంచి దేవ కన్యలు దిగడం... మహావిష్ణువు నాభినుంచి గాలిలో బ్రహ్మదేవుడు కూర్చొని ఉండటం...నెత్తిన గంపలో పిల్లోడిని పెట్టుకొని వసుదేవుడు సముద్రంలో వెళుతుంటే ఏడు శిరసుల పాము వచ్చి తన పడగతో కాపు కాయడం... రాక్షసుని బొడ్డులోంచి తాళాం వచ్చి జైలు తాళాం కప్ప తీయడం.. ఇలాంటి ఎన్నో దృశ్యాలు చూపరులను కట్టి పడేశాయి. ‘సురభి’ నాటకాలంటే సినిమాలను తలపించే భారీ సెట్టింగ్‌లు ఉంటాయని తెలిసిందే. చోడవరం స్వయంభూ గౌరీశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన సురభి నాటకాలు జనాన్ని కట్టి పడేస్తున్నాయి. ఇక్కడ ఐదు నాటకాలు ప్రదర్శించాల్సి ఉండగా శనివారం రాత్రి శ్రీ కృష్ణలీలలు నాటికను మొదటగా ప్రదర్శించారు.
భారీ సెట్టింగ్‌లు మధ్య ఈ నాటకంలో సన్నివేశాలు అబ్బురపరిచాయి. మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీ కృష్ణావతారంలో తన మేనమామ కంసుడిని వధించడంలో శ్రీ కృష్ణుడు చేసిన లీలలే ఈ కథ వృత్తాంతం. అయితే పురాణాల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప నేరుగా బహిరంగ స్టేజిపై ఇంతటి భారీ సెట్టింగ్‌లతో ఇలాంటి నాటికను ప్రదర్శించడంపై జనం ఆనందం వ్యక్తం చేశారు. మంచి టైమింగ్‌తో స్టేజిపై సెట్స్, వేశాలు, వ్యక్తులు మారడం, నెల రోజుల బాలుడి దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు ఈ నాటకంలో పాత్రలు పోషించడం కనువిందు చేశాయి. వేలాది మంది ప్రేక్షకులు తరలి రావడంతో వేదిక ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. మరింత ఉత్కంఠ రేపే సెట్టింగ్‌లతో బాలనాగమ్మ, మాయాబజార్, భక్తప్రహ్లాద, పాతాళబైరవి నాటకాలు వరుసగా 9వతేదీ వరకు ప్రదర్శించనున్నారు.