సుధాకర్‌ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు | CBI probe into Sudhakar case | Sakshi
Sakshi News home page

సుధాకర్‌ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు

Published Sat, May 23 2020 4:04 AM | Last Updated on Sat, May 23 2020 11:04 AM

CBI probe into Sudhakar case - Sakshi

సాక్షి, అమరావతి: మద్యం తాగి ఉభయ రాష్ట్రాల సీఎంలను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై న్యూసెన్స్‌ చేసినందుకు అనస్తీషియా వైద్యుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన వ్యవహారంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై 8 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని సీబీఐకి నిర్దేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పులను, ప్రభుత్వ కౌంటర్, మెజిస్ట్రేట్‌ నివేదికలతో అన్ని రికార్డులను సీబీఐ అడిగినప్పుడు ఇవ్వాలని రిజిస్ట్రా్టర్‌ జనరల్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేష్‌కుమార్, జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎంత నిజాయతీగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపినా, ఎవరో ఒకరు వేలెత్తి చూపుతారని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

► డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. లేఖతోపాటు ఓ వీడియోనూ జత చేశారు. ఆ వీడియోను ఎడిట్‌ చేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను జత చేశారు. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించడం తెలిసిందే. 
► దీనిపై జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ నెల 16న విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ మద్యం సేవించి సిగరెట్లు తాగి పోలీసులపైకి విసరడం.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం.. తదితరాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను పోలీసులు ధర్మాసనం ముందుంచారు. పోలీసుల పట్ల అత్యంత అభ్యంతరకరంగా సుధాకర్‌ వ్యవహరించారని ప్రభుత్వ న్యాయవాది వైఎన్‌ వివేకానంద నివేదించారు. 
► ఈ క్లిప్పింగులను పరిశీలించిన ధర్మాసనం.. ఇవి గానీ, అనిత పంపిన వీడియో క్లిప్పింగులు గానీ పరిపూర్ణంగా లేవని, వీటి ఆధారంగా నిర్దిష్టమైన నిర్ణయానికి రావడం సాధ్యం కాదంది. 
► అనంతరం డాక్టర్‌ సుధాకర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసి విశాఖ నాల్గవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పంపిన నివేదికనూ పరిశీలించిన ధర్మాసనం.. ఇందులోని అంశాలకు, ప్రభుత్వ కౌంటర్‌లోని అంశాలకు మధ్య తేడాలున్నాయంది. సుధాకర్‌ ఒంటిపై ఆరు గాయాలున్నట్లు మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, అయితే వైద్యులు ఒక గాయమే ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపింది. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయని, అందువల్ల ఓ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించడం మేలంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement