
మాట్లాడుతున్న ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
కృష్ణాజిల్లా, నూజివీడు : ప్రజల భద్రతా అవసరాల రీత్యా జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో ఇప్పటివరకు 936 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ నెలాఖరు నాటికి మరో వెయ్యి ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి చెప్పారు. నూజివీడులోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పట్టణాల్లో పూర్తయిన తరువాత గ్రామీణ ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ఏర్పాటు కోసం వ్యాపారస్తులు, దాతల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతగా వీటిని ఏర్పాటు చేస్తామని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు కచ్ఛితంగా ఆధారాలు లభిస్తాయని, ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు వాహనదారులకు పోలీసులే రసీదులు రాసి జరిమానాలు విధించేవారని, ఇక నుంచి త్వరలోనే ఈ–చలానా విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు.
ఈ–చలానా ఇచ్చిన తరువాత వాహనదారుడే నేరుగా వెళ్లి సంబంధిత కార్యాలయంలో జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే విజయవాడలో ఈ విధానం ఉందని, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, అవనిగడ్డ, నందిగామల్లో ఈ–చలానా విధానాన్ని అమలు చేస్తామన్నారు. చిలకలపూడి, అవనిగడ్డ, మైలవరం, కైకలూరు పోలీసుస్టేషన్‌లను మోడల్ పోలీస్‌స్టేషన్‌లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసింగ్‌ను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి ఎక్కువ సివిల్ తగాదాలకు సంబంధించిన సమస్యలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. పొలాలకు సంబంధించిన తగాదాలు, భార్యభర్తల గొడవలు తదితర సంబంధిత సమస్యలు ఉంటున్నాయన్నారు. కేసులను సెటిల్‌మెంట్ చేసే బ్యాచ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జిల్లా నుంచి బయటకు పంపించి వేస్తామని అన్నారు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, సీఐ మేదర రామ్‌కుమార్‌లు పాల్గొన్నారు.