తారు రోడైనా, సీసీ రోడ్డు నిర్మించినా బెర్ములు వేయడం ఎంతోఅవసరం. బెర్ములు లేకపోతే ఎంత నాణ్యతతో నిర్మించిన రోడ్డయినా త్వరగా పాడవ్వడం ఖాయం. కంకర మట్టితో బెర్ములు వేస్తేనే ఉపయోగం ఉంటుంది. కానీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇలాకాలో.. ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు ఇరువైపులా వేస్తున్న బెర్ములను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. రోడ్డు పక్కన బురదమట్టినే జేసీబీలతో తవ్వేసి బెర్ములుగా వేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కాంట్రాక్టర్లు. ఈ మట్టిని కూడా స్థల యజమానుల అనుమతి లేకుండానే తవ్వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
అరసవల్లి(శ్రీకాకుళం): జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లిలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు నిబంధనల మేరకు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాజీపేట పంచాయతీ ఆదిత్యనగర్ కాలనీలో సుమారు ఆరు కోట్ల రూపాయల ఉపాధి హామీపథకం నిధులతో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం పనులు జరగడం లేదు. అధికార పార్టీ నేతల అండదండలతో, స్థానిక నేతల ప్రోత్సాహంతో అధికారుల కళ్లు గప్పి కంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం సీసీ రోడ్లకు ఇరువైపులా సంబంధిత కాంట్రాక్టర్లు కచ్చితంగా బెర్ములను ఎర్ర కంకర మట్టితో నిర్మించాల్సి ఉంటుంది.
అందుబాటులో లేకపోతే దూరం నుంచైనా వాహనాలతో తెచ్చి వేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర?్ద. అయితే ఇక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు మాత్రం రోడ్డుకు ఇరువైపులా ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోని బురదమట్టినే నాలుగైదు జేసీబీలతో తీయించి రోడ్డు సైడ్ బెర్ములుగా వేస్తున్నారు. ఈ మట్టికి కూడా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకోవాలని కాంట్రాక్టర్లు చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెర్ములుగా వేస్తున్నది బురదమట్టి కావడంతో వర్షం పడితే ఇబ్బందులు తప్పవని స్థానికులు వాపోతున్నారు. అలాగే అనుమతి కూడా తీసుకోకుండా తమ స్థలాల్లోని మట్టిని తవ్వేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
సరిహద్దులు తొలగించి మరీ!
సీసీ రోడ్లకు బెర్ముల కోసం ఇళ్ల స్థలాల్లోని మట్టిని తవ్వేయడంపై స్థల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్యనగర్ కాలనీ విస్తరించడంతో పాటు సూర్యదేవాలయ ఖ్యాతి మరింత పెరగడంతో ఇక్కడి భూములకు డిమాండ్ ఉంది. లక్షలాది రూపాయలతో చాలామంది స్థలాలు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే తాజాగా సీసీ రోడ్లకు బెర్ములు వేసేందుకు మట్టిని తవ్వేసే ప్రయత్నంలో ఇంటి స్థలాల మధ్య సరిహద్దు రాళ్లు, పిల్లర్లను సైతం తొలగిస్తుండడంతో స్థల యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అనుమతి లేకుండా దౌర్జన్యంగా మట్టిని తవ్వేయడం ఎంతవరకు సమంజసమంటూ నిలదీస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గోతులు మా డబ్బులతో పూడ్చుకోవాలా?
ఇంటి కోసం స్థలం కొనుగోలు చేశాను. ఇప్పుడు మా స్థలాల్లో మట్టి కోసం పెద్ద గోతులు తవ్వేశారు. ఇదేమిటని అడిగితే పట్టించుకోవడం లేదు. ఆ గోతులను పూడ్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదెక్కడి న్యాయమో నేతలే చెప్పాలి. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకూడదు.
– ప్రభాకరరావు, రిటైర్డ్ ఉద్యోగి
అలా చేయడం కరెక్ట్ కాదు
రోడ్లకు బెర్ముల నిర్మాణం బాధ్యత కాంట్రాక్టర్‌దే. అలాగని ఇళ్ల స్థలాల మట్టిని తీసేసి బెర్ముల నిర్మాణం చేయకూడదు. బెర్ములను వేయిస్తేనే బిల్లులు చెల్లిస్తామని చెప్పాం. అయితే ఇలా జరుగుతుందని ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. సంబంధిత ఏఈతో విచారణ చేయించి తగు చర్యలు చేపడతాను.
– కె.నర్సింహమూర్తి, డీఈ, పంచాయతీరాజ్
ఇదేం పాడుపని!
Published Tue, Jul 4 2017 1:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
Advertisement
Advertisement