భారీగా పెరిగిన సిమెంట్ ధరలు
Published Sat, Apr 15 2017 1:01 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
గుంటూరు : రాష్ట్రంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే కంపెనీలు బస్తాకు 100 రూపాయలు మేర పెంచేశాయి. కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) మండిపడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని పేర్కొంటోంది. కంపెనీలు గనుక ధరల పెంపులో దిగిరాకపోతే, నిర్మాణాలు ఆపివేస్తామని క్రెడాయ్ హెచ్చరించింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎలాగైనా ధరలు తగ్గించేలా చూడాలని కోరుతోంది. ధరలను కంపెనీలు తగ్గించని పక్షంలో ఇతర దేశాల నుంచి సిమెంట్ ను దిగుమతి చేసుకుంటామని క్రెడాయ్ తెలిపింది.
ధరల పెంపుతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింటుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. సిమెంట్ కంపెనీలు ఈ మేర ధరలు ఒక్కసారిగా పెంచడం ఇదేమీ మొదటిసారి కాదని, అంతకమునుపు కూడా ఇలానే చేశాయని బిల్డర్స్, కాంట్రాక్టర్లు వాపోయారు. ఈ వ్యవహారంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ సిమెంట్ కంపెనీలకు భారీ జరిమానాలు కూడా విధించినట్టు గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గనుక పరిగణలోకి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుమతామని బిల్డర్స్, కాంట్రాక్టర్లు చెప్పారు.
Advertisement