సాక్షి, ఒంగోలు: కోవిడ్–19 వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్రం తగు చర్యలను సూచించింది. జిల్లాలో ఇప్పటి వరకూ 24 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 23 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనతో సంబంధం ఉన్నవే ఉన్నాయి. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని జిల్లా అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో కోవిడ్–19 అత్యధికంగా ప్రబలే అవకాశం ఉండటంతో కఠిన చర్యలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. అయితే జిల్లాను రెడ్ జోన్‌గా కేంద్రం ప్రకటించినందున లాక్‌డౌన్ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.
కొనకనమిట్ల మండలంలో కోవిడ్–19 పాజిటివ్ కేసు
జిల్లాకు చెందిన శాంపిల్స్‌లో మరో కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారిస్తూ ల్యాబ్ అధికారులు జిల్లా అధికారులకు నివేదికలు పంపించారు. దీంతో జిల్లాలో కోవిడ్–19 పాజిటివ్ కేసులు 24కు చేరుకున్నాయి. సోమవారం ల్యాబ్ అధికారుల నుంచి అందిన 76 నివేదికల్లో ఒకటి పాజిటివ్‌గా నిర్ధారించారు. కొనకనమిట్ల మండలం వెలిగండ్ల గ్రామానికి చెందిన యువకుడు ఢిల్లీలో మానవాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉండటంతో ఈ నెల ఒకటో తేదీన ఒంగోలు జీజీహెచ్‌లో చేర్చారు. పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులను కూడా జీజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
అందరూ ఆరోగ్యంగా ఉన్నారు
జిల్లా నుంచి ల్యాబ్‌కు పంపిన 206 కోవిడ్–19 శాంపిల్స్ నివేదికలు రావాల్సి ఉందని ఒంగోలు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి.శ్రీరాములు తెలిపారు. ఇప్పటి వరకు 339 శాంపిల్స్ నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో కోవిడ్–19 పాజిటివ్ వ్యక్తులందరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కొన్ని కేసులను కిమ్స్ వైద్యశాలకు తరలించామన్నారు. ఒకరికి ఇతర అనారోగ్య కారణాలు ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కూడా నికలడగా ఉందని అక్కడి వైద్యులు చెప్పారన్నారు.
క్వారన్‌టైన్, ఐసోలేషన్‌కు 826 గదులు
జిల్లాలో కోవిడ్–19 వైరస్ అనుమానితులను ఉంచేందుకు, పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేసేందుకు 826 గదులను సిద్ధంగా ఉంచారు. ఈ గదులన్నిటికీ ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి.
ప్రత్యేక వైద్యులు, నర్సులు
కోవిడ్–19 వైరస్ పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు అనుభవం ఉన్న వైద్యులు 30 మంది, నైపుణ్యం కలిగిన 56 మంది నర్సులను నియమించారు. ఇప్పటి వరకు 311 మందిని ఐసీయూలో అడ్మిట్ చేశారు.
పూర్తి స్థాయిలో చికిత్స కిట్లు
జిల్లాలో కోవిడ్–19 వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వాడే పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్లు(పీపీఈ) 3,560 అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది వాడే ఎన్ 95 మాసు్కలు 5,477, గ్లవ్స్ 1,60,611, సర్జికల్ మాసు్కలు 1,21,140, శానిటైజర్లు 15003, వెంటిలేటర్లు 37 ఉన్నాయి.
చీమకుర్తిలో శానిటైజర్ టన్నెల్
చీమకుర్తి: చీమకుర్తిలోని బీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలోని కరోనా క్వారంటైన్ సెంటర్‌లో ఆటో శానిటైజర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ను సోమవారం సాయంత్రం చీమకుర్తి తహసీల్దార్ విజయకుమారి ప్రారంభించారు. క్వారంటైన్ సెంటర్‌లో కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులకు ఆహారం, మంచినీరు, వైద్యం, ఇతర అవసరాలు తీర్చేందుకు రాకపోకలు సాగించే వ్యక్తుల రక్షణ కోసం ఈ ఆటో శానిటైజర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ పరికరాన్ని చీమకుర్తికి చెందిన ఇంజినీరింగ్ వర్క్స్‌లో నిపుణులైన షేక్ షఫీ, హెచ్ సుబ్బారెడ్డి స్వచ్ఛందంగా రూపొందించారు.
శానిటైజర్ టన్నెల్‌లో తహసీల్దార్‌పై ఆటోమేటిక్‌గా సోడియం హైపో క్లోరైట్ స్ప్రే
Comments
Please login to add a commentAdd a comment