చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు : దేశ ఆర్థికరంగం అభివృద్ధి చెందాలంటే చిన్నతరహా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకమైంది. గురువారం బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ పరిశ్రమలకు ఆశించిన మేరకు ప్రయోజనం కలగలేదు. ఇప్పటికీ విద్యుత్‌కోతలతో పరిశ్రమలు సతమతమవుతూ కోట్లాదిరూపాయలు బ్యాంకులకు బకాయిలు పడ్డాయి.
ఈ బడ్జెట్‌తో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆశించాం. ఆశించిన మేర ప్రోత్సాహం ఏమీ కనిపించలేదు. పరిశ్రమలను ప్రోత్సహించకుంటే ప్రభుత్వం ఆశించిన మేర వృద్ధిరేటు నమోదు కాదు. ఎప్పుడైనా పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటే ప్రభుత్వానికి కూడా తగినంత ఆదాయం వస్తుంది. చిన్నపరిశ్రమలకు సంబంధించి బడ్జెట్ ఆశాజనకంగా లేదు. చిన్నపరిశ్రమల వారికి ఇబ్బందులు తప్పవు.
- ఏపీకే రెడ్డి, రాష్ట్ర చిన్న, మధ్యతరహా
పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు
ధరల నియంత్రణకు చర్యలేవి?:
పేద,మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్‌లో చోటులేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పైగా విదేశీ పెట్టుబడులకు పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడంతో స్వదేశంలో పేదల బతుకులు దయనీయంగా మారనున్నాయి.
- ఉపేంద్ర, న్యాయవాది, నెల్లూరు
ఆశించిన ఫలితం లేదు:
నరేంద్రమోడీ నాయకత్వంలో యువతకు మం చి జరుగుతుందనుకున్నాం. అయితే బడ్జెట్‌లో యువత, విద్యార్థులకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపకపోవడం బాధాకరం.విద్యారంగానికి ఎక్కువగా బడ్జెట్ కేటాయిస్తే బాగుండేది. -బి లోకేష్‌రెడ్డి, విద్యార్థి, నెల్లూరు
సామాన్యులకు అందుబాటులో లేదు:
బడ్జెట్‌పై ఎంతో ఆశగా ఎదురు చూసిన సామాన్య ప్రజలకు నిరాశమిగిల్చింది. నిత్యవసర సరుకుల ధరలు తగ్గించేలా లేక పోవడం విచారకరం. ఏదైనా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. - బాలచంద్ర, ఉద్యోగి, వెంకటగిరి
ప్రత్యేక నిధులు నామమాత్రమే:
విభజన నేపథ్యంలో రాజధాని కూడా లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దగా కేటాయించింది లేదు. ప్రత్యేకంగా నిధులు సమకూర్చి విభజనతో నష్టపోయిన ఆంధ్రులను ఆదుకోవాల్సిన బాధ్యత మోడీ సర్కారుదే.
-చిల్లకూరు సుబ్రమణ్యంరెడ్డి,
రియల్ వ్యాపారి, సూళ్లూరుపేట
సీమాంధ్రకు నిరాశే:
ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా సీమాంధ్ర రాష్ట్రానికి నిరాశాజనంగా ఉంది. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాష్ట్రం అయినప్పటికీ బడ్జెట్‌లో కేటాయింపులు చేయకపోవడం విచారకరం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం చేయూత ఇవ్వదనే సందేహం కలుగుతోంది. ఉభయసభల్లో గత ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరేలా లేవు.
-కోవూరు వెంకటేశ్వర్లు, పొదలకూరు,
వినియోగదారుల సేవాసంఘం మండల అధ్యక్షుడు
బడ్జెట్ బాగుంది:
అరుణ్‌జైట్లీ ఆర్థిక బడ్జెట్ బాగుంది. తక్కువ ఖర్చుతో వాణిజ్యపరంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడే బకింగ్ కెనాల్‌కు పూర్వ వైభవం వచ్చేలా బడ్జెట్‌లో నిధులు విడుదల చేసి ఉంటే బాగుండేది. విశాఖ-చెన్నై కోస్టల్ కారిడార్ అభివృద్ధికి ఈ మార్గం ఎంతో ఉపయోగకరం.
- ఎన్ జయచంద్ర, వ్యాపారి, సూళ్లూరుపేట
ట్యాక్స్ మినహాయింపు రూ.ఐదు లక్షలకు పెంచాల్సింది:
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదు. ఉద్యోగుల ఇన్‌కమ్‌ట్యాక్స్ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ రూ.2.50 లక్షలకు పెంచారు. దీనిని రూ.5 లక్షలకు పెంచి ఉంటే బాగుండేది.
- మురళీకృష్ణ, ముత్తుకూరు , ఉపాధ్యాయుడు
పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడే బడ్జెట్
అధిక ధరలను తగ్గిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి కేంద్ర బడ్జెట్ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఉంది. పేదలు, కార్మికులు, కర్షకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆచరణ సాధ్యంకాని విధానాలను బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు. బీజేపీ మాటలో స్వదేశీ నినాదం, ఆచరణలో విదేశీ విధానం.
-చండ్ర రాజగోపాల్,
సీపీఎం జిల్లా కార్యదర్శి