కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ :కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులు నెలరోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ శశిధర్ అధికారులను ఆదేశించారు. గురువారం కడప నగరంలోని సింగపూర్ టౌన్‌షిప్ సమీపాన ఉన్న కేంద్రీయ విద్యాలయ భవనాలను, సిబ్బంది నివాస గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్యామ్‌సుందర్‌రావు విద్యాలయ భవన నిర్మాణాల గురించి కలెక్టర్‌కు వివరించారు. తమ విద్యాలయంలో 390 మంది విద్యార్థులున్నారని, రిమ్స్‌లో సమీపంలో 13.2 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.8.32కోట్లతో పనులు చేపట్టిందని పేర్కొన్నారు. కోల్‌కతకు చెందిన హిందూస్థాన్ స్టీల్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్‌కు పనులు అప్పగించామని, ఇప్పటి వరకు రూ.7.09కోట్లు ఖర్చు చేశారని వివరించారు. కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నిధులు మంజూరయ్యాయని, నిర్మాణ వ్యయంలో 5శాతం అంటే రూ.40లక్షల నిధులను నిబంధనల మేరకు తమ వద్దే ఉంచామన్నారు.
భవన నిర్మాణాలు పూర్తయి తమకు అప్పగించిన తర్వాత ఆ నిధులను కాంట్రాక్టర్‌కు చెల్లిస్తామని చెప్పారు. ఇందుకు కలెక్టర్ శశిధర్ స్పందించి ఏజెన్సీ హెచ్‌ఎస్‌సీఎల్ మేనేజర్‌తో మాట్లాడుతూ భవన నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని ప్రశ్నించారు. ఇందుకు మేనేజర్ బదులిస్తూ మిగిలిన నిధులు మంజూరు చేస్తే రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు. దీంతో ప్రిన్సిపాల్, ఏజెన్సీ ప్రతినిధులను కలెక్టర్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భవన నిర్మాణం సక్రమంగా జరిగిందో లేదో సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులైన ఆర్‌అండ్‌బీ ఈఈ, పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ అధిపతి వచ్చే మంగళవారం తనిఖీ చేస్తారన్నారు. వారికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాాజేందర్‌సింగ్, విజయ్‌కుమార్‌రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ అధిపతి రాఘవరెడ్డి, రహదారులు, భవనాల శాఖ డీఈఈ ప్రభాకర్ పాల్గొన్నారు.