సాక్షి, అమరావతి : పోలవరంపై కేంద్రం పంపిన లేఖలో ఏమీ లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసిందని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం అసెంబ్లీ వేదికగా ఆయన ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ప్రాజెక్టుకు పనులకు నవంబర్ 16వ తేదీన టెండర్లు పిలిచి, 30వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయలేదని మాత్రమే కేంద్రం లేఖలో ప్రశ్నించినట్లు చెప్పారు.
అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వాన్ని కేంద్రం లేఖపై తప్పుదోవ పట్టించారని అన్నారు. తొలుత రూ. 1395 కోట్లకు ఆహ్వానించిన టెండర్లను కేవలం 14 రోజుల వ్యవధిలో 1483 కోట్లకు(88 కోట్లు పెరిగాయి) ఎందుకు పెంచారని కేంద్రం అడగటంలో తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తమ ఆస్తులను ప్రజలకు పంచాల్సిన పని లేదని, వాళ్ల ఆస్తులను లాక్కోకుండా ఉంటే చాలునని అన్నారు.
పోలవరంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు. అధికారులు వాస్తవాలు చెప్పి ఉంటే ఇంత రాద్దాంతం జరిగేది కాదని చెప్పారు. బీజేపీ ఏ కబ్జాలకు పాల్పడదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిల్లో కేంద్రం పోలవరంను పూర్తి చేస్తుందని తెలిపారు. టెండర్‌కు 45 రోజుల గడువు ఇవ్వాల్సివుండగా.. 18 రోజులు మాత్రమే ఎందుకు ఇచ్చారన్నారు. లోపభూయిష్టమైన టెండర్‌ను మాత్రమే ఆపమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది గానీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపమని లేఖలో ఎక్కడా పేర్కొన్నలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment