సాక్షి, న్యూఢిల్లీ : అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి మొదటి విడతగా రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2018–19లో రూ.10 కోట్లు, 2019–20కి రూ.13 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఆరు కోర్సులు ప్రారంభించినట్టు తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు రహదారులను అత్యంత ప్రాధాన్యత గల రహదారుల కేటగిరీలో చేర్చి, త్వరితగతిన అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌సీపీ కాకినాడ ఎంపీ వంగా గీత కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్‌సభలో జాతీయ రహదారుల శాఖ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.
రహదారుల నిర్మాణం విషయంలో ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాలని కోరారు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం తెలపాలని విన్నవించారు. 400 కి.మీ. పొడవైన అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే మంజూరైనా.. ఇంకా డీపీఆర్ పూర్తవలేదన్నారు. భూసేకరణ కూడా జరగలేదని, పనులు మొదలుపెట్టలేదని సభ దృష్టికి తెచ్చారు. గుంటూరు–వినుకొండ, కడప–గిద్దలూరు, అనంతపురం–బుగ్గ, కర్నూలు–ఆత్మకూరు, ఆత్మకూరు–దోర్నాల తదితర ఆరు రహదారులను అత్యంత ప్రాధాన్యత గల రహదారులుగా గుర్తించాలని కోరారు. అలాగే జాతీయ రహదారులకు అనుబంధ రహదారులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఎన్‌హెచ్–16కు అనుబంధంగా కాకినాడ–యాంకరేజ్ పోర్టు–ఉప్పాడ బీచ్ రహదారి, కుంభాభిషేకం ఆలయం–ఫిషింగ్ హార్బర్ మధ్య ఫ్‌లైఓవర్, తదితర రహదారులను నిర్మించి స్థానికుల ఇక్కట్లను తొలగించాలని విన్నవించారు. డ్రైవర్ల సంక్షేమం దృష్ట్యా హైవేల్లో ఆస్పత్రులు ఏర్పాటుచేయాలన్నారు. కాకినాడ–రాజమండ్రి మధ్య ఆరు లైన్ల జాతీయ రహదారిని నిర్మించాలని కోరారు.
ఎన్‌ఐఏను మరింత బలోపేతం చేయండి
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)లో సిబ్బందిని పెంచి మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. లోక్‌సభలో ఎన్‌ఐఏ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. దేశంలో మానవ అక్రమ రవాణా పెద్ద సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు పూర్తి స్థాయిలో దీన్ని సమగ్ర దర్యాప్తు చేయలేకపోతున్నాయని వివరించారు. అలాగే.. బేడ, బుడగ, జంగం కులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలని కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మంత్రికి ఒక వినతిపత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment