ఇదీ.. అదృష్టమంటే..!
ఎన్నికల్లో టికెట్టు రాని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తికి అనుకోకుండా పరిస్థితులు కలిసొచ్చాయి. ఎన్నికల సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి చదలవాడను పోటీకి దింపాలని తొలుత భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వెంకటరమణ పేరును ఖరారు చేశారు. దీంతో చదలవాడ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆయనకి నచ్చజెప్పే బాధ్యతను ప్రస్తుతం ఢిల్లీలో కీలక బాధ్యత నిర్వర్తిస్తున్న ఓ నేతకు చంద్రబాబు అప్పగించారు. ఆయన హుటాహుటిన తిరుపతి వెళ్లి చదలవాడతో మంతనాలు జరిపారు. కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నప్పటికీ.. కొంత మెత్తబడిన చదలవాడ ఓ కండిషన్ పెట్టారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే టీటీ డీ బోర్డు మెంబరు పదవి కావాలని ప్రతిపాదించారట. దానికి ఓకే అన్న ప్రత్యేక దూత.. వెంటనే అధినేతకు నేరుగా ఫోన్ కలిపారు. చదలవాడ కోరికను చెవిలో వేశారు.
కార్యకర్తల నినాదాల హోరులో ప్రత్యేక దూత చెప్పినది బాబుకు సరిగా వినపడలేదట. టీటీడీ అనే పదమే అర్థమైంది. చదలవాడ టీటీడీ చైర్మన్ పదవిని కోరుకుంటున్నారని భావించిన చంద్రబాబు.. ఒకే చెప్పటంతో పాటు లిఖితపూర్వకంగా హామీనిస్తానంటూ వెంటనే ఒక లేఖను కూడా పంపారు. ఎన్నికలు ముగిసేవరకూ చంద్రబాబుకు, ఆయన దూతకు మధ్య జరిగిన సంభాషణ గుట్టుగా ఉన్నా, ఆ తరువాత పార్టీ వర్గాలకు లీకైంది. ఇప్పుడు పార్టీ నేతలంతా అదృష్టమంటే చదవలవాడదే అని అంటున్నారు.