రైల్వే కాంట్రాక్టుల కోసం రేణిగుంటకు వచ్చా
తిరుపతి: ఆధ్యాత్మిక నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమితులైన చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలోని ఆయన స్వగృహంలో గురువారం మధ్యాహ్నం ‘సాక్షి’ ప్రతినిధితో పలు విషయాలపై ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
నగర ప్రజలకు అందుబాటులోకి వైద్యం
నగరంలో ప్రతి ఒక్కరికీ ఆర్యోగాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తా. ప్రాణదాన ట్రస్టును ప్రవేశ పెట్టడంలో కీలకపాత్ర పోషించా. దానికి మొదటి దాతను నేనే. అదే అలిపిరి ఘటనలో నా ప్రాణాలను కాపాడింది. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తా. శాంతి భద్రతలు కాపాడేందుకు తమవంతు ప్రయత్నం చేస్తా. తిరుపతి టీటీడీలో అంతర్భామే కాబట్టి అందంగా తీర్చిదిద్దుతా.
అవినీతికి దూరంగా...అన్ని వర్గాలకు అందుబాటుగా
అవినీతికి దూరంగా ఉంటూ తిరుపతి ప్రజ లకు సేవ చేస్తాను. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సక్రమంగా నిర్వర్తించేలా ఓ భక్తునిగా ఆ దేవదేవుని కోరుకుంటున్నా. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ హిందూ మత ప్రచారాన్ని కొనసాగిస్తా.
ఇక్కడికి ఆయన్ను నమ్ముకొని వచ్చా..
నేను సామాన్యుడిని. నాకు దేవుడు అన్నీ ఇచ్చారు. నాకు కావల్సింది ఏమీ లేదు. ఆయన్ను నమ్నుకొని వచ్చాను. తిరుపతి ప్రజలు నన్ను అక్కున చేర్చుకొని ఆదరించారు. వెంకటేశ్వరస్వామి అలిపిరి ప్రమాదంలో కాపాడి ప్రాణాన్ని నిలబెట్టారు. నేను నమ్ముకొన్న పార్టీ, నాయకుడు పదవి ఇచ్చారు. చైర్మన్‌గా కాకుండా ఓ సేవకుడిగా నా బాధ్యతను నెరవేరుస్తా.
ఆయన ఆస్తులను కాపాడే వ్యక్తిగా..
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఎంతోమంది పెద్దలు గతంలో పనిచేశారు. వారి కోవలో సామాన్య భక్తులకు దగ్గరగా, ఆయన ఆస్తులను కాపాడే వ్యక్తిగా పనిచేస్తాను. శేష జీవితాన్ని పుణ్యక్షేత్రంలో, ధర్మానికి దగ్గరగా గడుపుతాను. ప్రజాస్వామ్యా న్ని, సామాన్యుల హక్కులను సంరక్షిస్తాను.
రేణిగుంటకు రైల్వే కాంట్రాక్టర్‌గా..
నాకు రాజకీయ భిక్ష పెట్టింది తిరుపతే. మాది నెల్లూరు జిల్లా నాయుడుపేట. 1973లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశా. నాయుడుపేట సర్పంచ్‌గా, సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశా. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, వెంగళరావు, శివశంకర్‌తో సన్నిహిత సంబంధాలుండేవి. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో దగ్గర సంబంధాలు ఉండేవి.
1977లో రైల్వే కాంట్రాక్టులు చేసుకునేందుకు రేణిగుంటకు వచ్చాను. 1994లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీచేసి స్వల్ప మెజారిటీ ఓడిపోయాను. 1999లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఈ సందర్భంగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.