
బాధితుల నుంచి వివరాలు తెలసుకుంటున్న ఆళ్ల నాని
పెదపాడు: ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలకడం వల్లే ఆయన ఆగడాలకు అడ్డూ ఆపులేకుండా పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. అప్పనవీడుకు చెందిన గరికపాటి నాగేశ్వరరావును చింతమనేని దౌర్జన్యం చేసి కొట్టడంతో ఆయన్ను గురువారం వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆళ్లనాని మాట్లాడుతూ రక్షించాల్సిన ఎమ్మెల్యేనే దాడులకు పాల్పడితే ఇంకా ప్రజలను ఎవరు కాపాడుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేష్, చంద్రబాబు చింతమనేని దందాల్లో వచ్చే వాటాలను తీసుకోవడం వల్లే ఆయన ఎన్ని ఆగడాలు చేసినా కాపాడుతూ వస్తున్నారని విమర్శించారు. చింతమనేని కొట్టి గాయపర్చిన ఓ మహిళా తహసీల్దార్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని భయపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్‌ను కొట్టాడన్న కారణంగా ప్రశ్నించిన గరికపాటి నాగేశ్వరరావును కొట్టి 45గంటలు అయినా ఎమ్మెల్యేపై ఇంత వరకు చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం చూస్తేంటే ప్రభుత్వ యంత్రాంగం ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. తమకు చింతమనేని నుంచి ఎప్పుడు రక్షణ దొరుకుతుందా అని దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
చంద్రబాబు బొమ్మ చిరిగిందని వీరంగం వేసి కొట్టిన వారిపై కేసునమోదు చేయకుండా.. తక్షణమే కేసు నమోదు చేయాలని అడిగారని 32మందిపై కేసు పెట్టడం సబబు కాదన్నారు. ఆ 32మందిపై వెంటనే కేసులు ఉపసంహరించాలని, చింతమనేని అరెస్ట్ చేయాలని ఆళ్లనాని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన బాధితులకు అండగా ఉండాలని తమను ఆదేశించారని చెప్పారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
సిగ్గుచేటు
వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్యయకర్త కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ 40 కేసులున్న చింతమనేని ఎమ్మెల్యే అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వారందరినీ వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు.నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు 40నుండి 50వరకు ఉన్నాయన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయ కర్త కొఠారు రామచంద్రరావు, వైఎస్సార్ సీపీ పెదపాడు మండల కన్వీనర్ అప్పన కనక దుర్గా ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొండే లాజరు, గారపాటి బాస్కరరావు, కమ్మ శివరామకృష్ణ, ఆళ్ల సతీష్‌చౌదరి, కాంగ్రెస్‌పార్టీ నాయకుడు చలమల శెట్టి రమేష్, అభయాంజనేయస్వామి దేవాలయ మాజీ చైర్మన్‌లు కేతినీడి జైనేంద్రకుమార్, బొప్పన కృష్ణ, మాజీ ఎంపీపీ సుధీర్‌బాబు, మధ్యాహ్నపు బలరాం, బేతాళ శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.