ఒక్క హామీనీ నిలబెట్టుకోని బాబు
ఎన్నికల హామీల విషయంలో వైఎస్ జగన్ నిజాయితీగా వ్యవహరించారని, కానీ చంద్రబాబు మాత్రం పాలనలోకి వచ్చి ఐదు నెలలైనా ఇప్పటివరకు తానిచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు విమర్శించారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో శనివారం జరిగిన పార్టీ సమీక్ష సమావేశానికి కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు హాజరయ్యారు.
రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారని, డ్వాక్రా రుణాలను రద్దుచేసి మళ్లీ వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కానీ బాబు పాలనలోకి వచ్చి ఐదు నెలలైనా రైతులకు గానీ, డ్వాక్రా మహిళలకు గానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రుణమాఫీ కోసం ఇంతవరకు మనం వేచి చూశామని, ఇక మండలాల స్థాయిలో నవంబర్ 5వ తేదీన ధర్నాలు చేపట్టాలని నాని అన్నారు. చంద్రబాబు వల్ల రైతులకు రుణ సాయం దక్కకుండా పోయిందని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. కృష్ణాడెల్టాలో ఇప్పటికీ సాగునీరు దక్కని రైతులున్నారని ఆయన గుర్తుచేశారు.