రుణమాఫీ పై బాబు దాటవేత | chandra babu is crossing the words by the Debt waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీ పై బాబు దాటవేత

Published Tue, May 27 2014 1:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

రుణమాఫీ పై బాబు దాటవేత - Sakshi

రుణమాఫీ పై బాబు దాటవేత

విలేకరుల సమావేశంలో పొంతనలేని సమాధానాలు
రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నా..
{పజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలవి
{పస్తుతం రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు
విభజన అనంతర పరిణామాలపై అధ్యయనం చేయాల్సి ఉంది
రుణమాఫీ అమలుపై మార్గాలన్నీ అన్వేషిస్తున్నాం, చర్చ జరగాల్సి ఉందని ప్రకటన

 
 న్యూఢిల్లీ: రుణమాఫీ హామీ నుంచి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పించుకుంటున్నారా? ఏపీ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాటతీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నానంటూనే... అమలుపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తాను హామీ ఇచ్చానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిపై చర్చ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే సమయానికి రాష్ట్రం విడిపోయింది కదా అని ప్రశ్నించగా... అవును, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదంటూ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు. రుణమాఫీపైనే తొలిసంతకం ఉంటుందా అని మీడియా ప్రశ్నించగా... ఏయే మార్గాలున్నాయో అన్నీ అన్వేషిస్తున్నాం, మీకు కూడా తెలిస్తే చెప్పండంటూ సమాధానం దాటవేశారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీభవన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతాన్ని పునాదుల నుంచి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. తెలంగాణతో సమానంగా సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించేలా కేంద్రం ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి నెల జీతాలే ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్‌డీఏతో పొత్తుపెట్టుకున్నామన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు నిజాయితీపరుడైన అశోక్‌గజపతి రాజుకు కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీకి ఒకే కేబినెట్ పదవి దక్కడంపై ఎలాంటి అసంతృప్తి లేదని, తమ పార్టీకి పదవుల కన్నా రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని చెప్పారు.

రాష్ట్ర విభజనకు సంబంధించిన వివరాలు సైతం తమకు తెలియవని, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత ఆదాయం వస్తుందోనన్న వివరాలు సైతం లేవని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎస్ మహంతి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కొన్ని వివరాలు తెలిశాయని చెప్పారు. మొదటి నెల జీతాలిచ్చే పరిస్థితే లేదంటున్నారు.. మీరు ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీని ఎలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘‘నేను ఎప్పుడు ఇచ్చాను ఈ హామీలు.. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు.. నేను పాదయాత్ర చేసిన ప్పుడు ప్రజల కష్టాలు చూసి హామీలిచ్చాను. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ చేసిన రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు అప్పుల పాలయ్యారు. డ్వాక్రా సంఘాల వాళ్లు అప్పుల పాలయ్యారు. అవి చూసి చలించిపోయి, అవి మాఫీ చేస్తే తప్ప వాళ్లు తిరిగి కోలుకోలేరని చెప్పి నేను రుణమాఫీ హామీ ఇచ్చాను. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అయినా నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను. ఎట్లా చేయాలో ఆలోచించేందుకు సమయం కావాలి. ముందుగా రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత అప్పు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుందన్న సమాచారమూ మా దగ్గర లేదు. ఆదాయం రాకపోతే ఏం చేయాలో తెలియదు. దీనిపై విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదు’’ అని సమాధానమిచ్చారు. ఒక్క శాతం ఓట్లు రానివాళ్లు గవర్నర్ దగ్గరికి వెళ్లి ప్రెస్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం ఏమిటని విమర్శించారు. మీ తొలి సంతకం రుణమాఫీపైనే ఉంటుందా అని ప్రశ్నించగా.. ఏయే మార్గాలున్నాయో అన్నీ అన్వేషిస్తున్నాం, మీకు కూడా తెలిస్తే చెప్పండంటూ సమాధానం దాటవేశారు.

నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తా: అశోక్‌గజపతి రాజు

 కేంద్రమంత్రిగా తనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తానని అశోక్‌గజపతిరాజు తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారని ప్రశ్నించగా.. ఎయిర్‌పోర్టులు నిర్మించేందు సరైన మౌలిక వసతులు అన్నీ చూసుకోవాల్సి ఉంటుందన్నారు. మంగళవారం జరగనున్న కేబినెట్ తొలి సమావేశంలో తాను పాల్గొంటున్నానని, మహానాడులో పాల్గొనడం లేదని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement