బాబు మాట నీటి మూటేనా!
సాక్షి ప్రతినిధి, కడప: కడప అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడుపు మంట. వివక్ష. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో అప్రాధాన్య జిల్లా ఏధైనా ఉందం టే వైఎస్సార్ జిల్లానే. అందుకే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రభు త్వ రంగ సంస్థలకు జిల్లా దూరంగా ఉండిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే కడపకు ‘చంద్ర’గ్రహణం పట్టిందనే చెప్పవచ్చు. అలాంటి తరుణంలో ఊహించని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర రాజధాని ప్రకటన నేపథ్యంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందు కు సంతోషించాలో, ప్రకటన అనంతరం ఈ హామీ ని విస్మరిస్తారని బాధపడాలో అర్ధంకాని స్థితిలో జిల్లా ప్రజానీకం ఉన్నా రు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజ ధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన ప్రాంతాలలో వ్యతి రేకత వ్యక్తం కాకుండా ఉండేం దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తల్లో భాగమే వరా ల జల్లు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజధాని ఏదైతేనేం, మన జిల్లా ను అభివృద్ధి చేస్తున్నారు కదా అన్న ధోరణితో ప్రజానీకం ఉండిపోయేలా రాజకీయ చతురత ప్రదర్శించారని పరిశీలకులు భావిస్తున్నారు.
పరిశ్రమలకు నెలవైన ప్రాంతం...
సీఎం ప్రకటించినట్లుగా జిల్లా పరిశ్రమలకు నెలవైన ప్రాంతం. అపార ముడిఖనిజం ఉండి మరో రెండు సిమెంటు పరిశ్రమలు స్థాపించేం దుకు సైతం అనుకూలమైన ప్రాంతం. విభజన బిల్లులో సైతం ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని నిర్ణయించారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూ రు, రాజంపేట, మైదుకూరు ప్రాంతాల్లో చేనేతల కోసం వస్త్ర పరిశ్రమ నెలకొల్పడం సంతోషించదగ్గ పరిణామం.
వెనుకబడిన ప్రాంతం లో ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే ఉపాధి మార్గాలు మెరుగు పడతాయని వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. ఆ మేరకు జమ్మలమడుగు వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసి, శరవేగం గా పనులు చేపట్టారు. రాజకీయ కారణాలతో ఆ పరిశ్రమకు మంగళం పలికారు. ప్రస్తుత తరుణంలో జిల్లాకు ఉక్కు పరిశ్రమ ప్రకటించడం సంతోషదాయకమని పలువురు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లీం మైనార్టీ వర్గాల కోసం ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఆ వర్గాలు హర్షిస్తున్నాయి. పండ్లతోటల కోసం వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతానని, దేవుని కడప, పెద్దదర్గా, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాల్లోనూ, భక్తకన్నప్ప, పోతనామాత్యుడు, అన్నమయ్య జన్మస్థలాల్లో టూరిజం స్పాట్ ఏర్పాటుకు సంకల్పించడంపై వివిధ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యేల డిమాండ్‌తో....
తిరుపతి, కర్నూలు, అనంతపురంను స్మార్ట్ సిటీలుగా చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు కడపను ప్రకటించాలని నినాదాలు చేశారు. వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకు న్న సీఎం స్మార్ట్ సిటీగా కడపను కూడా చేస్తామ ని ప్రకటించారు. డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రకటనలు చేస్తుండటాన్ని చూసిన పలువురు ఆచరణలో ఇవన్నీ సాధ్యమా? కేవలం రాజధాని ప్రకటన నేపథ్యంలో అందరినీ శాంతపర్చేందుకేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రకటనతోనే సరి...
ఆచరణలో లేదు గురి...
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటనలు చేయడంతోనే సరిపెట్టడం మినహా ఆచరణలో చూపెట్టరని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకు జిల్లాలోని గండికోట ప్రాజెక్టును ఉదహరిస్తున్నారు. 1996 ఫిబ్రవరి 29న పార్లమెంటు ఎన్నికలకు ముందు గండికోట ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి హోదాలో ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
తర్వాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. 1999 ఎన్నికల ముందు మరోమారు అదే ప్రాజెక్టు కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. అంతటితో సరిపెట్టడం మినహా ఆ ప్రాజెక్టు గురించి అధికారంలో ఉన్నన్నాళ్లు ఏమాత్రం శ్రద్ధ చూపిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టడంలో సిద్దహస్తుడిగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి మరోమారు జిల్లా ప్రజానీకాన్ని వంచించేందుకే సిద్ధపడ్డారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.