జిల్లాలో కమలం వికసించకుండా టీడీపీ కుయుక్తులు పన్నిందా? తాము ఎలాగూ గెలవలేమనుకున్న స్థానాలను బీజేపీకి అంటగట్టిందా? దోస్తీగా ఉంటూనే జిల్లాలో ఆ పార్టీని బలహీనపరుస్తోందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న టీడీపీ ఇప్పుడు విభేదించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇన్నాళ్లూ ఆ పార్టీ నీడలో తాము ఎదుగుతున్నామని భావించిన కమలనాథులు తీరా తేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కాయకల్ప చికిత్సలు ఆ పార్టీ నేతలు ఉపక్రమించినా ఫలితం కనిపించే పరిస్థితులు దరిదాపుల్లో లేవనే చెప్పాలి.
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్‌ఆర్ జిల్లాలో తన ఉనికిని చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. జిల్లాలో రాజంపేట, ప్రొద్దుటూరు, కడపలో ఆ పార్టీకి అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. అయితే జిల్లావ్యాప్తంగా గ్రామీణస్థాయిలో పట్టులేకపోవడం లోటు. రాష్ట్రస్థాయి నాయకులు లేకపోవడంతో పార్టీ బలం అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. అయినా 2009 ఎన్నికల్లో ప్రొద్దుటూరు, రాజంపేట నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను బరిలో నిలిపింది. అక్కడ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. అయినా నిరుత్సాహనికి గురికాకుండా ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు పోరాటాలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. అదే సమయంలో దేశవ్యాప్తంగా మోదీ హవా పెరుగుతోంది. ఆ సమయంలో జిల్లా నాయకుల్లో ఉత్సాహం ఉరకలేసింది.
2014లో పొత్తు..
దేశం యావత్తూ మోదీ జపం చేయబోతోందన్న విషయం స్పష్టం కావడంతో తెలుగుదేశం పార్టీ బీజేపీతో 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. దాంతో రాష్ట్రంలో పలు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను బీజేపీ కోరింది. అందులో కడప జిల్లాలో రాజంపేట ఎంపీ, కడప ఎమ్మెల్యే స్థానాలను బీజేపీకి టీడీపీ అధినేత కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనే టీడీపీ కుట్ర స్పష్టంగా తేలిపోయింది. కడప నగరంలో బీజేపీ పెద్దగా పట్టులేదు. కేవలం 5 వేల ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా మాత్రమే ఉన్న నేపథ్యంలో కడపలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు లేవు. అదే సమయంలో టీడీపీ కూడా ఈ స్థానం నుంచి గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఆ స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి ఇచ్చేసింది. ఎంపీ స్థానాన్ని సైతం ఓడిపోతామనే ముందుగా అంచనాకొచ్చాకే.. ఇక్కడ టీడీపీ పోటీ చేయకుండా బీజేపీకి ఇవ్వడం జరిగింది.
స్నేహధర్మం పేరిట వెన్నుపోటు..
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. 2014లో కడప ఎమ్మెల్యే స్థానాన్ని భారతీయ జనాతాపార్టీకి కేటాయించింది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా అల్లపురెడ్డి హరినాథ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో టీడీపీ నేత దుర్గా ప్రసాద్‌రావు చివరి నిమిషంలో ఆ పార్టీ బిఫారంతో నామినేషన్ దాఖలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మిత్రపక్షాలు బీజేపీ అభ్యర్థినే బలపరుస్తున్నాయని అందరూ ఆయనకే ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం విశేషం. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్టు కూడా దక్కలేదు. ఇక రాజంపేట ఎంపీ స్థానం బదులుగా మరో చోట పోటీ చేస్తామని బీజేపీ పట్టుబట్టినా ససేమిరా అన్న టీడీపీ అధినేత పొత్తులో భాగంగా ఆ పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించారు.
ఆ స్థానం నుంచి దగ్గుపాటి పురందేశ్వరి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డిపై ఓటమి చవిచూసింది. ఇక్కడా మిత్రపక్షం సహకరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తాము బీజేపీతో పొత్తు వల్ల చాలా సీట్లు నష్టపోయామని బహిరంగంగా వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి రాష్ట్ర కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు ఇచ్చినా వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. చిలికిచిలికి గాలివానలా ఇప్పుడు ఇరుపార్టీ నేతల మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు పొడచూపాయి. టీడీపీ తమపట్ల శత్రువులా వ్యవహరించడంపై బీజేపీ శ్రేణులు భరించలేకపోతున్నారు. టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో తాడోపేడో అన్నట్లుగా ఉంది.
ఇకపై ఒంటరిగానే..
టీడీపీతో పొత్తు తెగదెంపులు చేసుకోవాలన్న నిర్ణయానికి బీజేపీ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై జిల్లాలో ఒంటరిగానే తన బలం పెంచుకోవాలని దానిపై దృష్టి సారించింది. అగ్రనేతను జిల్లాకు పిలిచి బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఆ సమయంలో ఆగ్రనేత ద్వారా కమిటీ సభ్యులకు దశæ,దిశా నిర్దేశం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా కడప జిల్లా బూత్‌స్థాయి కమిటీ సభ్యుల సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పుష్పాల శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. కడప శాసనసభ నియోజకవర్గంలో బూత్ ఒక ఐదు మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment