కమలంతో దోస్తీ.. తమ్ముళ్తకు సుస్తీ
సాక్షి, కడప: 2012 సెప్టెంబర్ 27: బీజేపీతో పొత్తుపెట్టుకోవడం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడూ రానివ్వను.ఇప్పుడు: దేశప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్నాం.2011, మే 28: బీజేపీతో పొత్తుపెట్టుకున్నందుకు ముస్లింలకు బేషరుతుగా క్షమాపణ చెబుతున్నా. భవిష్యత్తులో మతవాదులతో ఇంకెప్పుడూ పొత్తుపెట్టుకోను.
ఇప్పుడు: అవినీతి కాంగ్రెస్‌ని ఓడించేందుకే ఎన్‌డీఏలో చేరుతున్నా.2013, జూన్ 11: మోడీ ప్రభావం 2014 ఎన్నికల్లో ఏమీ ఉండదు. ప్రాంతీయ పార్టీలు తమ సత్తాచూపిస్తాయి. కేంద్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. గుజరాత్‌లో మోడీకొత్తగా చేసింది ఏమీ లేదు. రాష్ట్రంలో నేను చేసిందే అక్కడ మోడీ చేశారు.ఇప్పుడు: దేశమంతా మోడీ వైపు చూస్తోంది. గుజరాత్‌లో ఆయన చేసిన అభివృద్ధిని దేశమంతా అమలు చేస్తారని జనం ఆశిస్తున్నారు. ఎన్‌డీఏ 300పైగా స్థానాలు గెలుస్తుంది.2012 మార్చి: గుజరాత్ అల్లర్ల వల్లే మేం 2004 ఎన్నికల్లో ఓడిపోవల్సి వచ్చింది.ఇప్పుడు: మోడీని అభివృద్ధి కోణంలో చూడాలి.
2002, ఏప్రిల్ 11: మోడీని తొలగించకుంటే ప్రజల్లో విశ్వాసాన్ని పొగొట్టుకుంటాం. మెరుగైన పాలన అందించలేమనే అపనమ్మకాన్ని ప్రజల్లో కల్గించకూడదు. హ్రస్వదృష్టి కలిగిన వ్యక్తుల వల్ల దేశం నష్టపోవద్దు.
ఇప్పుడు: రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసి మెరుగైన పాలన అందించేందుకు బీజేపీతో కలిసి టీడీపీ పనిచేస్తుంది.
ఇవి కొన్నేళ్లుగా పలు సందర్భాల్లో బీజీపీ (భారతీయజనతాపార్టీ) వైఖరిపై తెలుగుదేశపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు. అయితే ప్రస్తుతం ఊసరవెల్లిలాగా బాబు రంగులు మార్చారు. చేసిన ఆరోపణలు, విమర్శలు అన్నిటినీ మరిచి అధికారం కోసం మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు.
రెండిటి కలయికపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం వర్గాలు మండిపడుతున్నారు. సెక్యులర్‌పార్టీ అని చెప్పుకునే టీడీడీ ఇప్పుడు మతత్వపార్టీ అయిన బీజేపీతో ఎలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నిస్తున్నారు.
ఆ ఒక్కటీ దక్కదా!:
గత ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాలో ప్రొద్దుటూరు మినహా తక్కిన అన్నిటిలోనూ టీడీపీ ఓడిపోయింది. ఆపై జరిగిన ఉప ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. ఈ క్రమంలో బీజీపీతో పొత్తు వల్ల జిల్లాలోని ముస్లిం ఓటర్లు పార్టీకి దూరమైతే ఈ సారి 10 స్థానాల్లోనూ ‘సైకిల్’కు ఎదురుగాలి తప్పదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ పరిణామాలతో టీడీపీకి కాస్తోకూస్తో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు పూర్తిగా సెక్యులర్‌పార్టీ అయిన వైఎస్సార్‌సీపీకి బదిలీ అయ్యే అవకాశం ఉందని, ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తమ్ముళ్లలో గుబులు:
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు...బీజేపీ-టీడీపీ పొత్తు తెలుగుతమ్ముళ్లకు చిక్కులు తెచ్చిపెడుతోంది. బీజేపీ కలయికతో ముస్లిం ఓటుబ్యాంకు పూర్తిగా దూరమవడం అనివార్యమని, ఇదే జరిగితే జిల్లాలోని చాలా నియోజకవర్గాలో పార్టీకి గడ్డు పరిస్థితి తప్పదని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కడపలో టీడీపీ కొత్తపొత్తు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ఎప్పుడూ సెక్యులర్‌పార్టీకి పట్టం కట్టే కడప ఓటర్లు ఈసారి కూడా అదే పంథాలో నడవనున్నారు.
‘ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగించడంతో పాటు కడప సీటు ఎప్పటికీ ముస్లింలకే కేటాయిస్తానని చెప్పిన జగన్ వైపు ఇక్కడి ఓటర్లు మొగ్గు చూపే పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ టీడీపీ టిక్కెట్టుపై పోటీచేసేందుకు తమ్ముళ్లు వెనుకంజ వేస్తున్నారు. అలాగే రాయచోటిలోనూ ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు.
ఇక్కడ టిక్కెట్టు ఆశిస్తూ వచ్చిన పాలకొండ్రాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యం ‘పొత్తు’ వార్తతో షాక్ తినే పరిస్థితి. మామూలుగానే వైఎస్సార్ సీపీ హవాను తట్టుకోవడం కష్టమని, ఇప్పుడు పొత్తు పుణ్యమా అని పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని జంకుతున్నారు. గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ చంద్రబాబు ‘పొత్తు ఐడియా’ ఎమ్మెల్యే లింగారెడ్డి జీవితాన్ని మార్చనుంది.
ఇక్కడ వరదరాజులరెడ్డి రాకతో ఇబ్బందులు పడుతున్న లింగారెడ్డికి బీజేపీ పొత్తుతో ముస్లిం ఓటర్లు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. బీసీ కార్డుతో మైదుకూరు బరిలో నిలిచిన పుట్టా సుధాకర్ యాదవ్‌ది ఇదే పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే డీఎల్ రవీంద్రారెడ్డి చాణక్యం ముందు ‘పుట్టా’ కుదేలవుతున్నాడు.
మైదుకూరులో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో బీజేపీతో పొత్తు ముస్లిం ఓటర్లను పూర్తిగా వారినుంచి దూరం చేయనుంది. అలాగే బద్వేలు నియోజకవర్గంలో కూడా ముస్లిం ఓటర్లు ప్రతి ఎన్నికలో కీలకభూమిక పోషిస్తున్నారు. బద్వేలుతో పాటు కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన మండలాల్లో ముస్లిం ఓటర్లు అధికం. వీరంతా పార్టీకి దూరం అవుతున్నారని ఇక్కడి ‘పచ్చ’నేతలు తలలు పట్టుకుంటున్నారు.